ఫలించిన ఖిరిడి గ్రామస్థుల పోరాటం

ఫలించిన ఖిరిడి గ్రామస్థుల పోరాటం

ఆసిఫాబాద్, వెలుగు: ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు కోసం ఆ గ్రామస్థులు ఏడేండ్లుగా పోరాటం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను రోడ్డు కోసం బతిమిలాడారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. రోడ్డు నిర్మాణానికి సర్కారు రూ. 23 లక్షలు మంజూరు చేసింది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఘట్ జనగాం నుంచి ఖిరిడి వరకు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గ్రామానికి కేవలం మట్టి బాట ఉండడంతో వానాకాలంలో రోడ్డంతా బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడేవారు. పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు సైతం అరిగోస పడేవారు. రోడ్డు కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు పలుసార్లు విన్నవించారు. ఏటా వానాకాలంలో రోడ్డు వేయాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. అధ్వాన రోడ్డు కారణంగా గ్రామానికి అంబులెన్స్ పోలేని పరిస్థితి ఏర్పడడంతో సకాలంలో చికిత్స అందక పాముకాటుతో ఓ గిరిజన మహిళ మృతిచెందింది. దాంతో 2019లో 500 మంది గ్రామస్తులు 15 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. అప్పటికీ స్పందన కొరవడడంతో పలుసార్లు బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లు వేసి, చేపలు పట్టి నిరసన వ్యక్తం చేశారు. 

నిధుల మంజూరు

రోడ్డు కోసం ప్రజలు ఏడేండ్లుగా చేస్తున్న నిరసనలు, పోరాటాలు ఫలించాయి. రోడ్లు లేని గ్రామాల అనుసంధానంలో భాగంగా రోడ్లను మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిష్టినా చొంగ్తు జీఓ నంబర్ 184 ఈ నెల 15న విడుదల చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రూ. 63 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఖిరిడికి బీటీ రోడ్డు కోసం రూ. 23 లక్షలు మంజూరు చేశారు. 

పోరాటాలతోనే రోడ్డు శాంక్షన్

రోడ్డు మంజూరు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. ఫలితం లేకపోవడంతో ఖిరిడి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసినం. ఏడేండ్ల పోరాట ఫలితంగా గ్రామానికి రోడ్డు మంజూరు చేశారు. కానీ అరకొర నిధులతో రోడ్డు పూర్తి కాదు. మళ్లీ అవే బాధలు పునరావృతం కాకుండా పూర్తిస్థా యిలో రోడ్డు వేస్తే ఊరికి మంచిది.  

-  దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, ఖిరిడి