జన్నారం రూరల్, వెలుగు : టీవీ చూడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గురువారం జరిగింది. జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన ప్రకారం..
రోటిగూడ గ్రామానికి చెందిన మోత్కూరి అక్షిత (19) లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇంట్లో ఉన్న సమయంలో టీవీ చూస్తూ టైంపాస్ చేస్తుండడంతో... ‘ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటే పరీక్షల్లో మంచి మార్కులు ఎట్లా వస్తాయి..
ఇటీవల జరిగిన సెమిస్టర్‌లోనూ తక్కువ మార్కులు వచ్చాయి’ అని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షిత ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో చుట్టుపక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వారు వచ్చి అక్షితను జన్నారంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం చనిపోయింది. అక్షిత తండ్రి లక్ష్మీనారాయణగౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
