పార్ట్ టైం జాబ్, పెట్టుబడి పేరిట మోసం..రూ.2 లక్షలు కొట్టేసిన చీటర్స్

పార్ట్ టైం జాబ్, పెట్టుబడి పేరిట మోసం..రూ.2 లక్షలు కొట్టేసిన చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: పార్ట్ టైం జాబ్, పెట్టుబడి పేరిట ఓ విద్యార్థిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువకుడికి స్కామర్స్ టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ పంపించారు. వాట్సాప్ చానెల్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి, ఫాలో చేస్తే రూ.208 లు బోనస్ అందిస్తామన్నారు. దీంతో బాధిత యువకుడు ప్రమోట్ చేయగా, అతని అకౌంట్ రూ.208 లను స్కామర్స్ పంపించారు.

అనంతరం పెట్టుబడి పడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపారు. ఇండి కాయిన్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే పెట్టుబడి ఆధారంగా రోజుకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు సంపాదించవచ్చునన్నారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ.1,99,295 లను ఇన్వెస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన లాభం స్కామర్స్ వెబ్ లింక్ లో చూపెట్టారు.

దానిని విత్ డ్రా చేయాలంటే ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన  రూ.1,99,295 లను మరల ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. తన వద్ద అంత డబ్బులు లేవని బాధితుడు తెలపడంతో, ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి చెల్లించమన్నారు. దీంతో బాధితుడి మోసపోయానని గ్రహించి , సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్​లో ఫిర్యాదు చేశాడు.