
నీట్ స్కాంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. 2024, జూన్ 18వ తేదీ మంగళవారం ఉదయం హైదరాబాద్ లో ఎన్ఎస్ యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యుతో పాటు వాటి అనుబంధ యువజన విద్యార్థి నిరసన చేపట్టాయి. మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్నాయి విద్యార్థి సంఘాలు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు నిరసన మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనలో విద్యార్థి,యువజన సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 4,750 సెంటర్లలో 23 లక్షల33 వేల 297 మంది పరీక్ష రాశారు. పరీక్ష జరిగిన రోజే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) దీన్ని ఖండించింది.
జూన్ 4న నీట్ ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షలో13 లక్షల16 వేల 268 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్టు తెలిపింది. ఇందులో 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయని ప్రకటించింది. వీళ్లందరినీ టాప్ ర్యాంకర్లుగా చూపించింది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడంపై స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ 67 మందిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్‌లో ఎగ్జామ్ రాశారని, వాళ్లంతా ఒకే రూమ్‌లో కూర్చొని ఎగ్జామ్ రాశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకే సెంటర్‌లో రాసిన ఆరుగురికి సెంట్ పర్సెంట్ మార్కులు రావడం పట్ల దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.