- రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లిలో ఘటన
రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ స్టూడెంట్ పాము కాటుకు గురయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామానికి చెందిన ధరావత్ రోహిత్ ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ జడ్పీ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శుక్రవారం రోహిత్ స్కూల్‌కు వెళ్లాడు. అస్వస్థతగా ఉందని టీచర్‌ను అడిగి హాస్టల్‌కు వచ్చాడు. హాస్టల్‌కు చేరుకున్న అతడు.. గదిలోకి వెళ్లాడు. కాసేపటికి బయటకు వచ్చి తనకు పాము కరిచిందని హాస్టల్ సిబ్బందికి చెప్పాడు.
వారు వెంటనే ఇల్లంతకుంట పీహెచ్‌సీకి, అక్కడి నుంచి సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పాముకాటుకు గురైన స్టూడెంట్‌ను హాస్పిటల్‌లో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ పరామర్శించారు. అతడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. గాలిపల్లి బీసీ హాస్టల్ చుట్టూ చెట్లు, పంటపొలాలు ఉండడంతో పాములు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.