బడి గంట కొట్టేదెప్పుడు?.. స్టూడెంట్లు, తల్లిదండ్రుల్లో ఆందోళన

బడి గంట కొట్టేదెప్పుడు?.. స్టూడెంట్లు, తల్లిదండ్రుల్లో ఆందోళన
  • ఏడున్నర నెలలుగా బడులకు దూరంగా ఉన్న పిల్లలు
  • రీ ఓపెనింగ్​పై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోని రాష్ట్ర సర్కారు
  • డిజిటల్ క్లాసులకే పరిమితం.. అవి అర్థమైతలేవంటున్న స్టూడెంట్స్
  • కనీసం అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయని విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టూడెంట్లు ​బడులకు దూరమై ఏడున్నర నెలలు అవుతోంది. దసరా తర్వాత ప్రారంభిస్తారనే ప్రచారం జరిగినా.. దీపావళికి కూడా రీఓపెన్​ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అసలు ఎప్పుడు ఓపెన్​ చేస్తరు, ఏ తరగతుల వారికి ఎన్ని రోజులు, ఎన్ని క్లాసులు నడుస్తయ్, పరీక్షలు ఎప్పుడు పెడ్తరన్న దానిపై ఏ మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. నిజానికి రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్లు ప్రారంభించుకోవచ్చని కేంద్రం నెలన్నర రోజుల కిందటే ప్రకటించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలు స్కూళ్ల రీఓపెనింగ్​ షెడ్యూల్​ను రెడీ చేసుకున్నాయి. ఏపీలో అయితే సోమవారం నుంచే బడులు ప్రారంభించడంతో పాటు ప్రైవేటు స్కూళ్ల ఫీజులు 30 శాతం తగ్గించి తీసుకోవాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్ర సర్కారు దీనిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం రివ్యూ కూడా చేయలేదు. అకడమిక్​ క్యాలెండర్​ రెడీ చేయలేదు. ఈ తీరుపై పేరెంట్స్, టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

58 లక్షల మందికిపైగా..

రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు సహా మొత్తంగా 40,597 స్కూళ్లు ఉండగా.. వాటిలో 58 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం స్టూడెంట్లలో 53 శాతం మంది ప్రైవేటు బడుల్లో, 45 శాతం మంది సర్కారు బడుల్లో, మిగతా వారు ఎయిడెడ్ స్కూళ్లలో ఉన్నారు. కరోనా ఎఫెక్ట్​తో మార్చి 16 నుంచి స్కూళ్లన్నీ మూతపడ్డాయి. టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్​తోపాటు పలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతూనే రావడంతో విద్యా సంస్థలు ఓపెన్ చేసేందుకు చాన్స్ లేకుండా పోయింది.

లాక్​డౌన్​ లేకుంటే.. ఎండాకాలం సెలవుల తర్వాత జూన్​ 12 నుంచి బడులు రీఓపెన్​ కావాల్సి ఉంది.​కానీ మొదలవలేదు. ఆగస్టులో ప్రారంభించాలనుకున్నా పరిస్థితి కుదుటపడలేదు. దాంతో సెప్టెంబర్ 1 నుంచి దూరదర్శన్, టీశాట్ చానల్స్ ​ద్వారా డిజిటల్ క్లాసులు ప్రారంభించారు. దసరా తర్వాత స్కూళ్లు రీఓపెన్​ చేయాలని విద్యా, సంక్షేమ శాఖల మినిస్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్​లో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులను అయినా ప్రారంభించాలని భావించారు. అయితే సీఎం నుంచి అనుమతి వచ్చేదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సర్కారు పెద్దల నుంచి ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​కు మౌఖిక ఆదేశాలు రావడంతో అంతా సైలెంట్​ అయిపోయారు.

రాష్ట్రాలకే అప్పజెప్పిన కేంద్రం

దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై కేంద్రం అన్​లాక్ గైడ్ లైన్స్ 6లో స్పష్టత ఇచ్చింది. రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా తెరుచుకోవచ్చని సూచించింది.  అయితే పేరెంట్స్ నుంచి నోఆబ్జెక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పలు రాష్ట్రాలు స్కూళ్ల రీఓపెనింగ్​పై షెడ్యూల్​ రెడీ చేసుకున్నాయి. కానీ మన రాష్ట్ర సర్కారు దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. పక్కనున్న ఏపీ సోమవారం నుంచే 9, 10 క్లాసులను ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. స్కూళ్ల రీఓపెనింగ్‌కు​రెండు, మూడు వారాల ప్రిపరేషన్ అవసరమని, ఆ లెక్కన మన రాష్ట్రంలో స్కూళ్లను ఈ నెలలో తెరవడం కష్టమేనని ఓ ఉన్నతాధికారి చెప్పారు. స్కూళ్లను తెరిచి, గురుకులాలను ఓపెన్ చేయకుంటే పేరెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో బడుల రీఓపెన్‌పై సర్కారు ఆచితూచి అడుగులేస్తోందని పేర్కొన్నారు.

పేరెంట్స్ లో ఆందోళన

ఎనిమిది నెలల నుంచి పిల్లలు బడులకు దూరం కావడంతో పేరెంట్స్​లో ఆందోళన మొదలైంది. డిజిటల్, ఆన్‌లైన్ పాఠాలతో పిల్లలకు తలనొప్పి, కండ్లు గుంజడం, మెడ, నడుము నొప్పులు వస్తున్నాయని, దీంతో  ఈ క్లాసులకు దూరమవుతున్నారని పేర్కొంటున్నారు. నెలల తరబడి ఫిజికల్ క్లాసులకు దూరం కావడంతో చదువుపై కాన్సంట్రేషన్​ తగ్గుతోందని, ఒంటరి భావన మొదలవుతోందని, చదివినా గుర్తుండటం లేదని పిల్లలు చెప్తున్నారని అంటున్నారు. ఇప్పుడు స్కూళ్లు మొదలైనా.. పిల్లలు మళ్లీ మాములు స్థితికి రావాలంటే కనీసం ఆరు నెలల టైం పట్టే చాన్సుందని ఎడ్యుకేషనల్​ ఎక్స్​పర్టులు, సైకాలజిస్టులు చెప్తున్నారు.

ఎన్ని రోజులు క్లాసులు.. ఎప్పుడు పరీక్షలు

ప్రతి ఎడ్యుకేషన్​ ఇయర్​లో ఎన్ని పనిదినాలు ఉంటాయి? క్లాసులు, పరీక్షలు, సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయన్న వివరాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​ ఏటా అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచే ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించినా.. ఇప్పటివరకు 2020-21 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయలేదు. పైగా సిలబస్ ​తగ్గింపుపై అస్పష్టమైన ఆదేశాలిచ్చింది. టీచర్లు 100% సిలబస్‌ను పిల్లలకు చెప్పాలని.. కానీ 70% సిలబస్​మాత్రమే పరీక్షల్లో ఇస్తామని, మరో 30% సిలబస్ వర్క్​ ప్రాజెక్టులు ఇవ్వాలని సూచించింది. అసలు జూన్​లో మొదలుపెడితేనే చాలా బడుల్లో మొత్తం సిలబస్ పూర్తికాదు. అట్లాంటిది రెండున్నర నెలలు లేట్‌గా డిజిటల్ పాఠాలు మొదలుపెట్టి.. సిలబస్ మొత్తం పూర్తి చేయాలంటే ఎలాగని టీచర్లు అంటున్నారు. ఇప్పటికైనా అధికారికంగా అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసి, రీఓపెనింగ్​పై నిర్ణయం తీసుకోవాలని పేరెంట్స్, టీచర్స్​ యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి.

తలనొప్పి వస్తోంది

నేను ఏడో తరగతి చదువుతున్న. ఉదయం 8 గంటల నుంచి పగలు ఒంటిగంట వరకు ఆన్​లైన్ క్లాసులు చెబుతున్నరు. రోజూ ఐదారు గంటలు క్లాసులు వినాల్సి వస్తోంది. దీంతో తలనొస్తుంది. మా ఫ్రెండ్స్​లో కొందరికి కళ్లద్దాలు వచ్చినయ్​.
జల్ది స్కూళ్లు స్టార్ట్ చేస్తే బెటర్.

– ఎం.వరుణ్ మౌర్య, హైదరాబాద్

పిల్లలు క్లాసులు వింటలేరు 

నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఆరో తరగతి, ఇంకొకరు 8వ తరగతి చదువుతున్నరు. ప్రైవేటు స్కూల్​లో ఫీజు కట్టలేక దూరదర్శన్, టీశాట్ లో వచ్చే క్లాసులు వినిపిస్తున్న. మొదట్లో కొన్ని రోజులు టీవీలో క్లాసులు బాగానే విన్నరు. ఇప్పుడు అస్సలు వింటలేరు. టీవీల క్లాసులు అసలు అర్థమైతలేవని అంటున్నరు.

– శంకర్ రెడ్డి, పేరెంట్

విడతల వారీగా ప్రారంభించాలి

మనం కరోనాతో సహజీవనం చేస్తున్నాం. ఇలాంటి టైమ్ లో జాగ్రత్తలు తీసుకుంటూ విడతల వారీగా ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలి. ఆన్​లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ పై పిల్లల్లో ఆసక్తి తగ్గింది. కరోనా ఉన్నా పనులేవీ ఆగడం లేదు. టీచర్లు కూడా స్కూళ్లకు పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే బడుల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి.

– చావ రవి, యూటీఎఫ్​రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

విడతల వారీగా ప్రారంభించాలి

మనం కరోనాతో సహజీవనం చేస్తున్నాం. ఇలాంటి టైమ్ లో జాగ్రత్తలు తీసుకుంటూ విడతల వారీగా ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలి. ఆన్​లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ పై పిల్లల్లో ఆసక్తి తగ్గింది. కరోనా ఉన్నా పనులేవీ ఆగడం లేదు. టీచర్లు కూడా స్కూళ్లకు పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే బడుల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి.

– చావ రవి, యూటీఎఫ్​రాష్ర్ట ప్రధాన కార్యదర్శి