సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్లున్నా సౌలతులు లేవ్​!

 సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్లున్నా సౌలతులు లేవ్​!

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జేఎన్టీయూ కాలేజీలో అరకొర సౌలతులతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల పట్టణానికి సమీపంలో అగ్రహారం డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా ఇంజనీరింగ్  తరగతులు నిర్వహిస్తున్నారు.  గతేడాది జేఎన్టీయూహెచ్ కాలేజీ ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటా ద్వారా స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే కాలేజీలో సౌలతులు లేకపోవడం, లెక్చరర్ల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలేజీలో 2021–-22  విద్యా సంవత్సరంలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, టెక్స్ టైల్ విభాగంలో 109 మంది స్టూడెంట్లు, ఈ ఏడాది 204 మంది చేరారు. అగ్రహారం డిగ్రీ కాలేజీని పార్టేషన్ చేసి అందులోనే జేఎన్టీయూ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. కాలేజీ లో ల్యాబ్ లేదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్​కు ల్యాబ్​అవసరం పెద్దగా లేకపోవడంతో అంతగా ఇబ్బంది పడలేదు. కానీ సెంకడియర్ స్టూడెంట్లకు ల్యాబ్​కంపల్సరీ. ప్రస్తుతం రెండు మూడు రూంలలో ల్యాబ్​లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. 

టెక్స్ టైల్ కోర్సుపై ఆసక్తి చూపట్లే..
సిరిసిల్ల బట్టల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ లక్షకుపైగా నేతన్నలు ఉన్నారు. టెక్స్ టైల్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న క్రమంలో సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా టెక్స్ టైల్ కోర్సు ప్రవేశపెట్టారు. టెక్స్ టైల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్లను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సును ప్రారంభించారు. తొలిఏడాది కోర్సులో కేవలం 8 మంది మాత్రమే చేరారు.ఈ సెట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన స్టూడెంట్లు కలిపి ఈ కోర్సులో రెండో సంవత్సరానికి 22 మంది ఉన్నారు. ఈ ఏడాది టెక్స్ టైల్ కోర్సులో నలుగురు స్టూడెంట్లు చేరినా వీరు రెండో విడత కౌన్సిలింగ్ లో మరో కోర్సును ఎంచుకున్నారు. దీంతో ఈ ఏడాది టెక్స్ టైల్ కోర్సులో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు.

పోస్టులు లేవు.. స్థలమూ ఇవ్వలే
సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కటంటే ఒక్క రెగ్యులర్ పోస్టు కూడా లేదు. ప్రొఫెసర్ల కొరతతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ ప్రిన్సిపల్ మినహా ఒక్క రెగ్యులర్ లెక్చరర్​కూడా లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు లెక్చరర్స్ తో క్లాస్ లు రన్ చేస్తున్నారు. అగ్రహారం గ్రామంలో ఓ ప్రైవేటు బిల్డింగ్ అద్దెకు తీసుకుని ప్రస్తుతానికి అందులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని చెబుతున్న పాలకులు ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించలేదు. కాలేజీ నిర్మాణం చేపట్టేందుకు ఇంతవరకు స్థల సేకరణకు ప్రభుత్వం నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామమైన పెద్దూర్ లో 400 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా ఇక్కడ కాలేజీకి యాభై ఎకరాలు కేటాయిస్తామంటూ ఏడాది కిందట ఆఫీసర్లు స్థల పరిశీలన చేశారు. కానీ నేటికీ ఏం తేల్చలేదు. 

లెక్చరర్లను నియమించాలె డిగ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ 
క్లాస్ లు నడుపుతున్నారు. కానీ ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా లేకుండా కాలేజీ నడపడం వల్ల స్టూడెంట్లు  నష్టపోతారు. ఇప్పటికే లెక్చరర్స్ లేకుండా ఏడాది గడిచింది. వెంటనే కాలేజీకి లెక్చరర్స్ పోస్టులను ప్రభుత్వ మంజూరు చేయాలి. పక్కా బిల్డింగ్​నిర్మించాలి. అరకొర వసతులతో కాలేజీ నడపటం సరికాదు. స్టూడెంట్లు నష్టపోతే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తాం. 
– ఎర్రవెల్లి జగన్, స్టూడెంట్​లీడర్, జేఎన్టీయూహెచ్