పీజీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తలేరు

పీజీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తలేరు

 

  • పీజీ చేసేటోళ్లు తగ్గుతున్నరు
  • నిరుటితో పోలిస్తే 10 వేలకు పైగా తగ్గిన అప్లికేషన్లు
  • ప్రొఫెషనల్ ​కోర్సుల వైపు వెళ్తున్నట్లు అంచనా
  • చేరుతున్న వారిలోనూ అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపిస్తలేరు. పీజీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గుతున్నది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది పీజీలో చేరుతున్నారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే.. పీజీ చేస్తున్న ఓసీలు తక్కువ ఉండగా, ఎస్సీ, ఎస్టీలు కొంత ఎక్కువ మందే ఉంటున్నారు. 

ఓయూ పరిధిలోనే..

రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఏటా కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్) నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా పీజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. నిరుడు సీపీగెట్​కు 78,305 మంది రిజిస్టర్ చేసుకోగా, ఈ ఏడాది 67,027 మందికి తగ్గింది. 2021–22లో44,604 సీట్లుంటే, వాటిలో కేవలం 22,812 మంది మాత్రమే చేరారు. అందులోనూ ఓయూ పరిధిలోనే ఎక్కువగా అడ్మిషన్​పొందారు. పీజీ కోర్సుల్లో చేరుతున్న వారిలోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. నిరుడు పీజీ కోర్సుల్లో చేరిన అబ్బాయిలు 6,649 మంది ఉంటే, అమ్మాయిలు 16,163 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా సీపీగెట్​లో 54,050 మంది క్వాలిఫై అయితే, వారిలో అమ్మాయిలు 36,437 ఉండగా, అబ్బాయిలు కేవలం17,613 మంది మాత్రమే ఉన్నారు. అబ్బాయిలు ఇతర పనుల్లో చేరుతుండటంతోనే  పీజీలో చేరడం లేదని అధికారులు చెప్తున్నారు. అమ్మాయిలు మాత్రం పెండ్లి చేసుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల ఆమోదంతో పీజీ చేస్తున్నట్టు భావిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ... 

పీజీ కోర్సుల్లో చేరుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నిరుడు ఎస్సీ స్టూడెంట్లు 5,523 మంది, ఎస్టీలు 2,330 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఓసీలు కేవలం వెయ్యి మంది వరకే ఉన్నారు. ఈ ఏడాది కూడా సీపీగెట్​లో ఎస్సీ విద్యార్థులు 13,768 మంది, ఎస్టీలు 6974 మంది పరీక్ష రాసి  క్వాలిఫై కాగా, ఓసీలు 5,217 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఓసీల్లో చేరేది సగం మంది  కూడా ఉండరని అధికారులు చెప్తున్నారు. ఓసీలు సాంప్రదాయ కోర్సుల వైపు పెద్దగా మొగ్గుచూపడం లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. వారంతా ప్రొఫెషనల్ కోర్సులతో పాటు విదేశాల్లో చదువుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గురుకులాలు పెంచడంతోనే ఆయా కేటగిరీల్లోంచి స్టూడెంట్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు ముందుకు వస్తున్నారని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు.