అకడమిక్​ ఇయర్​ ఆగమాగం

అకడమిక్​ ఇయర్​ ఆగమాగం
  • వేసవి సెలవులపై అయోమయం 
  • వచ్చే అకడమిక్ ఇయర్ పై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, వెలుగు: ఓవైపు కరోనా ప్రభావం, మరోవైపు జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ కారణంగా ప్రస్తుత అకడమిక్ ఇయర్ అంతా ఆగమాగమైంది. కొత్త అకడమిక్ ప్రారంభమయ్యే సమయంలో పాత అకడమిక్ ఇయర్ ముగిసే పరిస్థితి తలెత్తింది. దీంతో వేసవి సెలవులు ఉంటయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్, ఇంటర్ ఎడ్యుకేషన్ తో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. వీటన్నింటి ప్రభావం వచ్చే అకడమిక్ ఇయర్ పై పడనుండడంతో స్టూడెంట్లు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా అకడమిక్ ఇయర్ జూన్ లో ప్రారంభమై, ఏప్రిల్ లో ముగుస్తుంది. ఇంటర్మీడియట్ మాత్రం నెలరోజులు ముందుగానే పూర్తవుతుంది. కానీ ఈసారి అది తారుమారైంది. జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ కారణంగా ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను రెండుసార్లు మార్చారు. మార్చిలో జరగాల్సిన పరీక్షలు మే మొదటి వారంలో జరగనున్నాయి. మరోవైపు మార్చి నెలాఖరులో ప్రారంభమయ్యే టెన్త్ ఎగ్జామ్స్ మే నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. మే 24 వరకు ఇంటర్ పరీక్షలు, జూన్ 1 వరకు టెన్త్ పరీక్షలు కొనసాగనున్నాయి. అంటే సాధారణంగా ఎప్పుడు ఫలితాలు ప్రకటించే టైమ్ లో ఈసారి ఎగ్జామ్స్ జరగనున్నాయి. అకడమిక్ ఇయర్ దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ముగియనుంది. 

ఇంటర్ కు సెలవులు కష్టమే...  
రాష్ట్రంలో 2,200 జూనియర్ కాలేజీల్లో 9.20 లక్షల మంది చదువుకుంటున్నారు. అకడమిక్ ఇయర్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 12తో పరీక్షలు ముగుస్తాయని, ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని ఇంటర్ బోర్డు మొదట ప్రకటించింది. కానీ తాజా షెడ్యూల్ ప్రకారం మే 24న పరీక్షలు ముగుస్తాయి. మరి స్టూడెంట్లకు వేసవి సెలవులు ఉంటయా? అకడమిక్ ఇయర్ ను ఆలస్యంగా ప్రారంభిస్తరా? అనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. 

జులైలో రిజల్ట్!
జూన్ 1న టెన్త్ పరీక్షలు ముగిస్తే, ఆ నెలంతా పేపర్ వాల్యుయేషన్ కొనసాగనుంది. జులైలో రిజల్ట్ ఇచ్చే అవకాశముంది. దీంతో జూన్ 1న ప్రారంభం కావాల్సిన ఇంటర్ అకడమిక్ ఇయర్.. జులై నెలాఖరు లేదా ఆగస్టులో ప్రారంభం కానుంది. ఇక ఇంటర్ పరీక్షలు మే నెలాఖరు వరకు ఉండటంతో జూన్ నెలాఖరు వరకు పేపర్ వాల్యుయేషన్ కొనసాగనుంది. జులైలో రిజల్ట్ రానుంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఆలస్యంగా నిర్వహిస్తుండటంతో ఎంసెట్, ఈసెట్ తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జులైలో జరుగనున్నాయి. వాటి ఫలితాలు ఇచ్చి, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం కావాలంటే ఆగస్టు/సెప్టెంబర్ నెలాఖరు వరకు టైమ్ పట్టే అవకాశం ఉంది.  మళ్లీ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, రిజల్ట్ ప్రకటించడం తదితర ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. 

ఎంబీబీఎస్ లో అడ్మిషన్లే కాలే.. 
ఏటా ఎంబీబీఎస్‌‌ అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టులో ముగుస్తుంది. కానీ ఈసారి దాదాపు 7 నెలలు ఆలస్యమైంది. పోయినేడాది ఆగస్టులో ముగియాల్సిన 2021–22 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైంది. ప్రస్తుతం ఫైనల్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ నడుస్తోంది.  మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి కనీసం ఇంకో 15 రోజులు పట్టే అవకాశం ఉంది. పోయినేడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా నీట్ ఎగ్జామ్ వాయిదా పడడం, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టులో కేసులు నమోదవడం, ఇంతలోనే థర్డ్ వేవ్‌‌ రావడం తదితర కారణాలతో అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. 

బడుల్లో సమ్మర్ హాలీడేస్ ఉంటయా? 
రాష్ట్రంలో 41 వేల స్కూళ్లలో 61 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రస్తుత అకడమిక్ ఇయర్ లో కరోనా కారణంగా జులైలో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టారు. ఏప్రిల్ 23 లాస్ట్ వర్కింగ్ డే అని, 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఉంటాయని సర్కార్ ప్రకటించింది. అయితే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 1 లాస్ట్ వర్కింగ్ డే. ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగింది. ఇలాంటి టైమ్ లో అన్ని క్లాసులను జూన్ 1 వరకు కొనసాగించే అవకాశం లేదు. దీంతో 9వ తరగతి స్టూడెంట్ల వరకు పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్ నెలాఖరులోనే సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇంకా నెల టైమ్ ఉందని, సెలవుల గురించి ఇంకా ఆలోచించలేదని అధికారులు అంటున్నారు.