తెలంగాణ వర్సిటీలో అన్నీ సమస్యలే!

తెలంగాణ వర్సిటీలో అన్నీ సమస్యలే!

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలతో స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునేవారు లేక పదేండ్లుగా సమస్యలతో సావాసం చేస్తున్నారు. ఫ్యాకల్టీ పోస్టులను సర్కారు భర్తీ చేయకపోవడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. వసతి సౌకర్యం సైతం సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. ట్రిపుల్​ ఐటీ ఉద్యమ తరహాలో టీయూ స్టూడెంట్లు సైతం ఆందోళనకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల కేంద్రం శివారులో తెలంగాణ యూనివర్సిటీని ప్రభుత్వం 2006లో రెండు పీజీ కోర్సులతో ప్రారంభించింది. 2009లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి 28 కోర్సులు షురూ చేశారు.  ప్రస్తుతం ఆర్ట్స్​అండ్ ​సైన్స్ ​విభాగాల్లో 30 కోర్సుల్లో 1,750 మంది స్టూడెంట్లు ఇక్కడ చదువుతున్నారు. మొత్తం 30 డిపార్ట్​ మెంట్లకు 144 ఫ్యాకల్టీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కేవలం 85 మందిని మాత్రమే నియమించారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో బదిలీలు, ప్రమోషన్లపై వెళ్లగా ప్రస్తుతం 69 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం 30 డిపార్ట్​మెంట్లలో 19 విభాగాలకు మాత్రమే ఫ్యాకల్టీ పోస్టులు మంజూరు చేశారు. మిగితా 11 విభాగాలకు ఇంకా వంద మంది అవసరం. ఆ పోస్టులు మంజూరు కాకపోవడంతో స్టూడెంట్స్​కు విద్యాబోధన సరిగా జరగక సతమతమవుతున్నారు. 

హాస్టల్స్​లో అసౌకర్యాలు.. నాసిగా ఫుడ్​

వర్సిటీలో మొత్తం 1,750 మంది స్టూడెంట్స్​ఉండగా వీరిలో 450 మంది అమ్మాయిలు ఉన్నారు. మూడు హాస్టళ్లు ఉండగా రెండు బాయ్స్​కు, ఒకటి గర్ల్స్​కోసం కేటాయించారు. ప్రధానంగా గర్ల్స్​హాస్టల్​లోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 324 మంది ఉండాల్సిన చోట 425 మంది ఉంటున్నారు. నీటి సౌకర్యం, టాయిలెట్స్ ​సరిపడా లేక అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాల్లో ఆలస్యం వల్ల తరగతులకు సరైన వేళల్లో వెళ్లలేకపోతున్నారు. ధరల భారంతో యూనివర్సిటీ మెస్​లో ఫుడ్​ నాసిగా పెడుతున్నారు. ఒక్కో స్టూడెంట్​కు నెలకు ప్రభుత్వం రూ. 1,500 చెల్లిస్తోంది. అయితే ఒక్కొక్కరికి మెస్​చార్జీలు రూ. 2,200 అవుతున్నాయి. దీంతో ఫుడ్​లో క్వాలిటీ కొరవడుతోందని స్టూడెంట్లు చెబుతున్నారు. 

మెరుగైన వసతి కల్పించండి

తెలంగాణ వర్సిటీలో గర్ల్స్​కి ఒకే హాస్టల్​ఉండడంతో నానా అవస్థలు పడుతున్నం. 324 మంది ఉండాల్సిన చోట 425 మందిని ఉంచారు. ఒక్కో గదిలో 8 మంది ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మంచినీటి సౌకర్యం కూడా సక్రమంగా లేదు. డిస్పెన్సరీ లేక అవస్థలు పడుతున్నాం. ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. మెస్​చార్జీలను పెంచకపోవడంతో ధరలు పెరిగి నాసిరకం ఫుడ్​అందిస్తున్నారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. 
– అరుణ, పీజీ స్టూడెంట్​

పోస్టులు వెంటనే భర్తీ చేయాలె

వర్సిటీలో 75 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 4 ఏండ్లుగా వర్సిటీలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఖాళీల వల్ల విద్యాబోధన లేక రిజల్ట్స్ పై ఎఫెక్ట్​ పడుతోంది. పదేళ్లుగా ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నత విద్యామండలి, వర్సిటీ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. తక్షణమే 75 పోస్టులను భర్తీ చేయాలె. 
– వేణురాజ్, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రెసిడెంట్, నిజామాబాద్