విదేశాలకు వెళ్లే విద్యార్థులు కుటుంబ సభ్యులతో.. శంషాబాద్ ఎయిర్​పోర్టు కిటకిట

 విదేశాలకు వెళ్లే విద్యార్థులు కుటుంబ సభ్యులతో.. శంషాబాద్ ఎయిర్​పోర్టు కిటకిట

విదేశాలకెళ్లే స్టూడెంట్లతో ముగ్గురు లేదా నలుగురే రావాలి : డీసీపీ నారాయణరెడ్డి


శంషాబాద్, వెలుగు: రెండు మూడ్రోజులుగా విదేశాలకు వెళ్లే స్టూడెంట్లతో పాటు వారికి సెండాఫ్ చెప్పేందుకు కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా వస్తుండటంతో ఇతర ప్యాసింజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఎయిర్ పోర్టులో సెక్యూరిటీని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, ఏసీపీ రామచంద్రారావు, సీఐ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. 

డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్​కు ఫారిన్​కు వెళ్లే స్టూడెంట్లతో పాటు ముగ్గురు లేదా నలుగురు మాత్రమే రావాలని సూచించారు. ప్రతి రోజూ శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ నుంచి 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. భారీగా ప్రయాణికులు వస్తుండటంతో సెక్యూరిటీ పార్కింగ్​లో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ఒక్కో విద్యార్థి వెంట 20 నుంచి 30 మంది కుటుంబ సభ్యులు వస్తున్నారని వివరించారు. పంద్రాగస్టును దృష్టిలో పెట్టుకుని హై అలర్ట్ ప్రకటించడంతో ఎక్కువ మందికి ఎంట్రీ అవకాశం ఉండదన్నారు.