సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు 

సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన ఓయూ విద్యార్థులు 

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్శిటీలోని C హాస్టల్స్ లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ప్రధాన రహదారిపై బైఠాయించారు. వర్షాలకు హాస్టల్ పై భాగం పెచ్చులూడి తమపై పడుతున్నాయని, ఈ విషయం గురించి ఓయూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు విద్యార్థులు. విద్యుత్ బోర్డుల నుంచి వర్షం నీళ్లు కారుతుండడంతో షాక్ వస్తుందని, దీనికి బాధ్యలు ఎవరని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. 

మెస్ లో ఫుడ్ బాగోలేదని, పురుగుల అన్నం వడ్డిస్తున్నారని ఓయూ  C హాస్టల్స్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చదువుకోవడానికి వచ్చామో..? లేక చనిపోవడానికి వచ్చామో అర్థం కావడం లేదన్నారు. నోటిఫికేషన్ సమయంలో తమను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలోని రోడ్లను మూసివేసి, విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వీసీ వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు. అయితే.. అధికారులు వచ్చి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.