చిట్యాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్: కలెక్టర్‌‌ ను కలిసేందుకు.. స్కూల్‌‌ గోడ దూకి వెళ్లిన స్టూడెంట్లు

చిట్యాల బీసీ రెసిడెన్షియల్ స్కూల్: కలెక్టర్‌‌ ను కలిసేందుకు..  స్కూల్‌‌ గోడ దూకి వెళ్లిన స్టూడెంట్లు

పట్టుకొని స్కూల్‌‌కు తీసుకొచ్చిన ప్రిన్సిపాల్‌‌, సిబ్బంది
చిట్యాల బీసీ గురుకులానికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడిన కలెక్టర్‌‌

వనపర్తి టౌన్, వెలుగు : వనపర్తి మండలం చిట్యాల బీసీ గురుకులంలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కొందరు స్టూడెంట్లు కలెక్టర్‌‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ లెటర్‌‌ రాసుకొని.. కలెక్టరేట్‌‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ స్టూడెంట్లను బయటకు పంపేందుకు ప్రిన్సిపాల్‌‌, వార్డెన్‌‌, ఇతర సిబ్బంది ఒప్పుకోలేదు.

 దీంతో కొందరు స్టూడెంట్లు సిబ్బంది కంటపడకుండా స్కూల్‌‌ కాంపౌండ్‌‌ వాల్‌‌ దూకి కలెక్టరేట్‌‌ వైపు పరుగులు తీశారు. వీరిని గమనించిన ప్రిన్సిపాల్‌‌, సిబ్బంది స్టూడెంట్లను పట్టుకొని తిరిగి స్కూల్‌‌కు తీసుకొచ్చారు. ఈ విషయం కలెక్టర్‌‌ ఆదర్శ్‌‌ సురభికి తెలియడంతో ఆయన వెంటనే చిట్యాల బీసీ గురుకులానికి చేరుకున్నారు. 

స్టూడెంట్లు, స్కూల్‌‌ సిబ్బందితో సమావేశమై వివరాలు సేకరించారు. ప్రిన్సిపాల్ గురువయ్య గౌడ్, వార్డెన్, మరికొంత మంది స్టాఫ్‌‌పై స్టూడెంట్లు ఫిర్యాదు చేశారు. స్కూల్‌‌లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిని ప్రిన్సిపాల్, స్టాఫ్‌‌ టార్గెట్‌‌ చేస్తున్నారని, పేరెంట్స్‌‌ వచ్చినప్పుడు లేని పోని విషయాలు చెప్పి తిట్టిస్తున్నారని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

 అవసరం లేకున్నా వివిధ రకాల వస్తువుల పేరుతో స్టూడెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ... స్కూల్‌‌లో నెలకొన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు బాక్సుల్లో వేయాలని, వాటి ఆధారంగా సమస్యలను ఆఫీసర్లను పరిష్కరిస్తారని చెప్పారు. 

తర్వాత స్టూడెంట్లతో కలిసి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ యాదయ్య, డీఎంహెచ్‌‌వో శ్రీనివాసులు, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్‌‌ రమేశ్‌‌రెడ్డి పాల్గొన్నారు.