
మణిపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు బోల్తా పడి.. 15 మంది విద్యార్థులు చనిపోయారు. నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్ విద్యార్థులు రెండు బస్సుల్లో స్టడీ టూర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో లాంగ్ సామ్ ప్రాంతాల్లో అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన విద్యార్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో సమయంలో 36 మంది విద్యార్థులు, పలువురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇంఫాల్ కు నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్ సాయి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ఇక ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్లో షేర్ చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని కోరారు. మృతి చెందిన కుటుంబాలకు బీరేన్ సింగ్ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.