అటు కరోనా.. ఇటు ఫీజులు.. ఫలితం నో స్టూడెంట్స్

అటు కరోనా.. ఇటు ఫీజులు.. ఫలితం నో స్టూడెంట్స్
  • స్టూడెంట్లు వస్తలేరు
  • ఫీజుల భారంతో పాటు కరోనా, ఎండల భయం 
  • పిల్లలను స్కూళ్లకు పంపని పేరెంట్స్
  • 6,7,8 తరగతులు ప్రారంభమై వారం
  • ఇప్పటి వరకు 34% దాటని అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 6,7,8 తరగతుల స్టూడెంట్లకు ఫిజికల్ క్లాసులు ప్రారంభమై వారమవుతున్నా, పిల్లలు పెద్దగా బడులకు రావడం లేదు. సర్కార్ స్కూళ్లతో పాటు ప్రైవేట్, మోడల్, కేజీబీవీలు, గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా బుధవారమే అత్యధికంగా 34 శాతం అటెండెన్స్ నమోదు కాగా.. గవర్నమెంట్ బడుల్లో 41%, మోడల్ స్కూళ్లలో 40%, ప్రైవేట్ లో 31%, కేజీబీవీల్లో 12%, గురుకుల సొసైటీల్లో 6 శాతమే హాజరు నమోదైంది. కరోనా భయం, ఫీజుల భారంతో పాటు ఎండలు పెరగడంతోనే పిల్లలు బడులకు రావడం లేదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18,487 హైస్కూళ్లు ఉండగా… వాటిలో 6 నుంచి 8 తరగతుల స్టూడెంట్లు 14లక్షల 30వేల 216మంది చదువుకుంటున్నారు. వీరికి పోయిన నెల 24న బడులు ప్రారంభం కాగా.. తొలి రోజు గవర్నమెంట్ స్కూళ్లలో 9%,   ప్రైవేట్ లో 10%, మోడల్ స్కూళ్లలో 2%, కేజీబీవీల్లో 4 శాతమే అటెండెన్స్ నమోదైంది. ఇక గురుకులాలకు అయితే ఎవరూ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా స్కూళ్లలో అటెండెన్స్ శాతం పెద్దగా పెరగలేదు.

768 ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్​కాలే..

రాష్ట్రంలో 9,795 ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. వాటిలో 6 నుంచి 8 తరగతుల స్టూడెంట్లు 7,73,105 మంది చదువుకుంటున్నారు. వీరిలో బుధవారం 4,89,036 (34 శాతం) మంది మాత్రమే బడులకు వచ్చారు. కాగా, ఇప్పటి వరకు 768 ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్​కూడా కాలేదు. ఇవన్నీ వనపర్తి, సూర్యాపేట, వరంగల్ రూరల్, కరీంనగర్, గద్వాల, సిరిసిల్ల, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఉన్నాయి. అత్యధికంగా ప్రైవేటు స్కూళ్లున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 26 శాతం, రంగారెడ్డిలో 18 శాతం, మేడ్చల్​లో 29 శాతం స్టూడెంట్స్ మాత్రమే బడులకు వస్తున్నారు.

మూడు నెలల చదువులకు ఏడాది ఫీజులా?

చాలా జిల్లాల్లో 30 శాతం లోపే స్టూడెంట్స్ బడిబాట పట్టారు. ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు, టీచర్లు స్టూడెంట్ల ఇండ్ల చుట్టూ తిరిగినా పిల్లలు మాత్రం బడులకు వెళ్లడం లేదు. దీనికి ప్రధాన కారణం ఫీజుల భారమేనని తెలుస్తోంది. రెండు, మూడు నెలల చదువులకు ఏడాది ఫీజులు ఎందుకు చెల్లించాలనే భావనలో పేరెంట్స్ ఉన్నారు. ప్రభుత్వం ఎలాగైనా పిల్లలను పైక్లాసులకు ప్రమోట్ చేస్తుండడంతో వారిని బడులకు పంపకున్నా ఏం కాదని.. పైగా ఫీజుల భారం తగ్గుతుందని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పిల్లలను స్కూళ్లకు పంపించి, ఫీజులు కడితేనే వచ్చే అకడమిక్ ఇయర్​కు ప్రమోట్ చేస్తామని పేరెంట్స్ కు మేనేజ్మెంట్లు ఫోన్లు, మెసేజ్​లు చేస్తున్నాయి. అయినప్పటికీ అటెండెన్స్ పెరగకపోవడం గమనార్హం. అయితే కొందరు పేరెంట్స్ మాత్రం ఫీజులు చెల్లిస్తామని, కానీ కరోనా టైమ్​లో పిల్లలను బడులకు మాత్రం పంపబోమని చెబుతున్నారు.

ఎండలు, కరోనా వల్లనూ..

పిల్లలను ప్రైవేట్ లో చదివిస్తున్న పేరెంట్స్ ఫీజుల భారంతో వెనక్కి తగ్గుతుండగా.. పిల్లలను సర్కార్ స్కూళ్లలో చదివిస్తున్న పేరెంట్స్ కరోనా భయంతో బడులకు పంపడం లేదు. అన్ని తరగతులకు టీవీల్లోనే డిజిటల్​ పాఠాలు వస్తుండడంతో స్టూడెంట్లు వాటినే వింటున్నారు. ఒక్కరికి కరోనా వచ్చినా, బడిలో అందరికీ సోకుతుందనే భయంతో పేరెంట్స్ జంకుతున్నారు. ఇంకొన్ని రోజులు వేచి చూద్దామని చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గితేనే పంపించాలని కొందరు పేరెంట్స్ భావిస్తున్నారు. మరోవైపు ఎండలు పెరిగిపోవడం, ట్రాన్స్ పోర్టు సౌకర్యం కూడా పెద్దగా లేకపోవడంతో బడుల్లో అటెండెన్స్ తగ్గుతోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఒక్క నెలకు ఏడాది ఫీజు కట్టాల్నా..

మా బాబు ఓ ప్రైవేట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. కరోనా వల్ల ఇన్ని రోజులు ఇంట్లనే ఉన్నడు. ఇప్పుడు స్కూళ్లు ఓపెన్ అయినా పంపిద్దామంటే, ఒకట్రెండు నెలల చదువుకే ఏడాది ఫీజులు కట్టాలంటున్నరు. మరోవైపు మళ్లీ కరోనా వస్తోందనే వార్తలు వస్తున్నయ్. ప్రభుత్వం స్టూడెంట్లను ఎలాగైనా పైక్లాసులకు పంపిస్తదని చెబుతున్నరు. అందుకే ఈ ఒక్క నెల  ఇంటి దగ్గరే చదివించుకుంటే సరిపోతదని అనుకుంటున్న.

– బండారు పద్మ, లింగగిరి, సూర్యాపేట జిల్లా

కరోనా భయంతో పంపుతలేరు

నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో 7వ తరగతి చదువుతున్న. కరోనా కేసులు పెరుగుతున్నాయని మా పేరెంట్స్ స్కూల్​కు పంపుతలేరు. మొన్నటి
వరకు ఆన్ లైన్ క్లాసులు విన్న. ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయినంక, ఆన్ లైన్ క్లాసులు కూడా బంద్ చేశారు. స్కూల్​కు తప్పకుండా రావాలని
అంటున్నరు.

– రిషి కార్తీక్, స్టూడెంట్, హైదరాబాద్