బలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్

బలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 5,6 తరగతులకు చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో వెంటనే మిగతా విద్యార్థులు పాఠశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు వాహనాల్లో వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేశారు. మెస్ సిబ్బంది మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఈ విషయంపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేస్తే ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ ఉదయం బ్రేక్ ఫాస్ట్ బాగాలేదని చెప్పామని, అయినా రాత్రి డిన్నర్ లో మళ్లీ పురుగులు వచ్చాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారం తింటూ తమ చదువులను ఎలా కొనసాగించాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. కాగా.. ఈ విషయం బయటకు పొక్కడంతో అక్కడకు చేరుకున్న మీడియాను పాఠశాల సిబ్బంది లోపలికి అనుమతించలేదు.