రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు అనారోగ్యం పాలైతున్నరు

రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు అనారోగ్యం పాలైతున్నరు
  • ఇటీవల స్టూడెంట్​ మృతి 
  • ఉమ్మడి జిల్లాలో వందల మంది విద్యార్థులకు జ్వరాలు 
  • స్కూళ్లలో మందులు ఇచ్చే వారు కరువు 

ఆదిలాబాద్, వెలుగు: కలుషిత నీరు.. అపరిశుభ్రత.. క్వాలిటీ లేని భోజనం కారణంగా ఉమ్మడి జిల్లాలోని  రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో వైరల్​ఫీవర్స్​బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వందలాది మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు మాత్రమే ఆఫీసర్లు స్కూళ్లను విజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో పరిస్థితి చేయిదాటుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 

చూసేవారేరీ...

ఉమ్మడి జిల్లాలో 133 రెసిడెన్షియల్​స్కూళ్లు ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగతున్నాయి. వీటిలో 40 వేల మంది చదువుకుంటున్నారు. నిత్యం విద్యార్థుల ఆరోగ్యం పర్యవేక్షించేందుకు గతంలో ఒక్కో స్కూల్ కు ఔట్​సోర్సింగ్​పద్ధతిన ఒక ఏఎన్ఎం నియమించారు. రోజువారీగా ఆమె విద్యార్థులను పర్యవేక్షించేవారు. జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తితే మందులు ఇచ్చి ప్రాథమికంగా ఇబ్బంది లేకుండా చూసేవారు. మూడు నెలల క్రితం ఔట్​సోర్సింగ్​ఏజెన్సీ గడువు ముగిసింది. ప్రభుత్వం పాతవారిని రెన్యూవల్​చేయలేదు. కొత్తగా ఎవరినీ నియమించలేదు. ఇటీవల విద్యార్థులు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతుండడంతో సమయానికి మందులు ఇచ్చేవారు కరువయ్యారు. పక్షం రోజులకు ఒకసారి పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్, ఆర్ బీఎస్ కే డాక్టర్లు ఆశ్రమ స్కూళ్లను విజిట్ చేసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ అది ఎక్కడా అమలుకావడంలేదు. కుంటాల రెసిడెన్షియల్​స్కూల్, చించుఘాట్ పాఠశాలలను ఇటీవల ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సందర్శించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అయితే కొన్ని స్కూళ్లలో మాత్రమే క్యాంపులు నిర్వహించి వదిలేశారు.

విద్యార్థి సంఘాల వినతి..

ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల లీడర్లు మూడు రోజులుగా ఐటీడీఏ, కలెక్టరేట్ ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. సీజనల్ ​వ్యాధుల నుంచి విద్యార్థులను కాపాడాలని డిమాండ్​చేశారు. ప్రతీ హాస్టల్​లో రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని, కుంటాల రెసిడెన్షియల్​స్కూల్​విద్యార్థిని మృతికి కారణమైన హెచ్ఎం, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి పేరు రాథోడ్​భాగ్యశ్రీ(11). ఊరు ఫకీర్​నాయక్​తండా. ఈమె నేరడిగొండ మండలం కుంటాల రెసిడెన్షియల్ స్కూల్​లో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల వైరల్ ​ఫీవర్​బారిన పడడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ఇచ్చోడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మరుసటి రోజు అదే స్కూల్​కు చెందిన 20 మంది వైరల్ ఫీవర్ తో ఆదిలాబాద్​లోని రిమ్స్ హాస్పిటల్​లో చేరారు.

విధుల్లోకి తీసుకోవాలి

నాలుగేళ్లుగా రెసిడెన్షియల్​స్కూల్​లో ఏఎన్ఎంగా పనిచేసిన. స్టూడెంట్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యావేక్షించిన. ప్రభుత్వం ఏఎన్ఎంలను తొలగించింది. ఇప్పుడు నేను పొలం పనులకు పోతున్నా. మళ్లీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. 

– రాథోడ్ అశ్విని, కుంటాల ఏఎన్ఎం 

మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం

రెసిడెన్షియల్​ స్కూళ్లలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. మెడికల్ ఆఫీసర్లు, ఆర్బీఎస్ కే వైద్యులు, సెకండ్ ఏఎన్ఎంలను స్కూళ్లను విజిట్ చేయాలని ఆదేశించాం. 

– దిలీప్, ఐటీడీఏ డీడీ