న్యూఢిల్లీ, వెలుగు: ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉద్యమ నేతనని చెప్పుకునే కేసీఆర్ మనసు మాత్రం కరగడం లేదని అఖిల భారత విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ జాతీయ చైర్మన్ సగరపు ప్రసాద్ విమర్శించారు. కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులు వాడుకున్న సీఎంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మంగళవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అఖిల భారత విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రసాద్ మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆస్తులను కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్‌కు ఆర్టీసీ ఆస్తులపై ఉన్న ప్రేమ, కార్మికులపై లేదని విమర్శించారు. కేంద్రం స్పందించి రాష్ట్రంలో ఆగడాలు అరికట్టాలని కోరారు. కార్మికులను డిస్మిస్ చేస్తే అన్ని వర్గాలు ఒక్కటై సీఎంగా కేసీఆర్‌ను డిస్మిస్ చేయాలని ప్రజా సంఘాల జేఏసీ కన్వీర్ బోర సుభాష్ అన్నారు.
కేంద్రం స్పందించాలి: ఏఐఏడబ్ల్యూయూ
ఆర్టీసీని ప్రైవేట్ చేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని.. సంస్థలో 31 శాతం వాటా ఉన్న మోడీ సర్కార్ రాష్ట్ర సర్కారు ప్రకటనలపై స్పందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ఉపాధ్యక్షుడు బి. వెంకట్ కోరారు. ఆర్టీసీ ప్రైవేటు జపం చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలంతా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా మంగళవారం ఢిల్లీలోని తెంగాణ భవన్ వద్ద ఏఐఏడబ్ల్యూయూ నేతృత్వంలో ధర్నా జరిగింది. ర్యాలీగా భవన్‌కు చేరుకున్న సంఘం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. వెంకట్ మాట్లాడుతూ.. తెంగాణలో చారిత్రాత్మక సమ్మె జరుగుతోందని, 50 వేల మంది కార్మికులను సీఎం కేసీఆర్ బెదిరించినా, దాడులు చేసినా వెనక్కి తగ్గకుండా సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. మేఘా లాంటి కంపెనీలకు అమ్ముకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు.

