పాఠాలు చెప్పడు.. అడిగితే.. బూతులు తిడుతున్నడు!..ఫిజిక్స్ టీచర్ తీరును భరించలేక విద్యార్థుల ధర్నా

పాఠాలు చెప్పడు.. అడిగితే.. బూతులు తిడుతున్నడు!..ఫిజిక్స్ టీచర్ తీరును భరించలేక విద్యార్థుల ధర్నా
  •    మెదక్ జిల్లా కన్నారం జడ్పీ స్కూల్ వద్ద ఘటన

కౌడిపల్లి, వెలుగు: పాఠాలు చెప్పకుండా.. ఫోన్ లో వీడియోలు చూస్తూ, అడిగితే బూతులు తిడుతున్నాడని, టీచర్ ను వెంటనే బదిలీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. వెంటనే బదిలీ చేయాలని స్కూల్ ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం జడ్పీ స్కూల్ ఫిజిక్స్ టీచర్ శ్రీకాంత్ గౌడ్ .. సరిగా పాఠాలు చెప్పడని, అడిగితే బూతులు తిడుతాడని, సెల్ ఫోన్ లోని యూట్యూబ్ లో కామెడీ వీడియోలు చూస్తూ తిరుగుతుంటాడని, సౌండ్ తో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. 

 టీచర్ శ్రీకాంత్ ను చదువు ఎందుకు చెప్పడం లేదని అడిగితే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తను యూనియన్ లీడర్ అని, రాజకీయ నేతల సపోర్ట్ కూడా ఉందని తమపై, హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయారు. రెండు రోజుల కింద విద్యార్థితో మరో విద్యార్థితో కొట్టించడంతో టీచర్ తీరు భరించలేక శుక్రవారం ఉదయం విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగారు. 

టీచర్ శ్రీకాంత్ తమకు వద్దంటూ నినాదాలు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు హెడ్​మాస్టర్​కు వినతి పత్రం అందజేశారు. హెచ్ఎం శేషాద్రి కుమార్ ను వివరణ కోరగా .. టీచర్ శ్రీకాంత్ తను యూనియన్ లీడర్ ను, సీనియర్ నని, ఎలాంటి పని చెప్పొద్దు, జూనియర్ వాళ్లతో పని చేయించాలంటున్నారని తెలిపారు.