పాట్నా: శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవని పేర్కొన్నారు. శనివారం పాట్నాలోని చాణక్య నేషనల్ లా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు క్రూరంగా వ్యవహరించే ఘటనలు ఎదురైనప్పుడు కోర్టులు చూస్తూ ఊరుకోవని, శాంతియుతంగా నిరసన తెలిపే వారి హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ వెనకడుగు వేయదని సీజేఐ తేల్చిచెప్పారు.
కొలీజియంలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలను రికార్డు చేసినప్పటికీ, వాటిని ఎందుకు బహిర్గతం చేయరన్న ప్రశ్నకు కూడా సీజేఐ బదులిచ్చారు. వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ట ముడిపడి ఉన్నప్పుడు పారదర్శకతకు కూడా కొన్ని హద్దులుంటాయని తెలిపారు.
