
జగిత్యాల రూరల్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జగిత్యాల కలెక్టరేట్లో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా మంత్రి అడ్లూరి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు.
60 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జగిత్యాల జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలకు అవకాశం కల్పించిందని వెల్లడించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి లేని వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి సేవాగుణం, అంకితభావం, విలువలను ఉపాధ్యాయులందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లత, డీఈవో రాము, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఎంఈవో, హెచ్ ఎంలు పాల్గొన్నారు.