
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఇంకా పాఠ్య పుస్తకాలు అందలేదు. కాలేజీలు ప్రారంభమై 25 రోజులు దాటినా ఇప్పటికీ పుస్తకాల ఊసే లేదు. ఇంటర్మీడియెట్ అధికారులు తెలుగు అకాడమీకి ప్రింటింగ్ ఆర్డర్సకాలంలోనే ఇచ్చినా, వారు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, పుస్తకాల్లేకుండా ఎలా చదువుకోవాలని స్టూడెంట్లు ప్రశ్నిస్తున్నారు.స్టేట్‌లో 407 సర్కారు కాలేజీలున్నాయి. వాటిలో సుమారు1.90 లక్షల మంది చదువుతున్నారు. కేజీబీవీ, ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో సుమారు లక్ష మంది వరకు ఇంటర్ కోర్సు ల్లో ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది. అయితే, ఇంటర్మీడియెట్2023–24 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచే ప్రారం భమైంది. ఇప్పటికే 25 రోజులు గడిచిపోయాయి. అయినా విద్యార్థులకు టెక్స్ట్‌బుక్స్ అందలేదు. విద్యాసంవత్సరం ప్రారంభం రోజే పుస్తకాలు ఇస్తామంటూ సర్కారు పెద్దలు ప్రగల్భాలు పలికినా, అమలులో మాత్రం సాధ్యం కాలేదు. దీంతో పుస్తకాల్లేకుండానే విద్యార్థులు కాలేజీలకు వచ్చిపోతున్నారు. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.
ఇన్‌చార్జిలతోనే సమస్య
ప్రస్తుతం తెలుగు అకాడమీకి శ్రీదేవసేన ఇన్చార్జ్డైరెక్టర్గా, ఇంటర్మీడియెట్కమిషరేట్కు నవీన్ మిట్టల్ ఇన్చార్జ్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు పుస్తకాలపై వీరిద్దరూ రివ్యూ చేయలేదని తెలుస్తోంది. తెలుగు అకాడమీకి పూర్తిస్థాయి అధికారిని కొనసాగించాలనే డిమాండ్ వస్తున్నా, సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. శ్రీదేవసేనకు ఇప్పటికే పలు బాధ్యతలు ఉండటంతో, అకాడమీపై పెద్దగా దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. నవీన్ మిట్టల్ ప్రస్తుతం సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లాంటి కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో ఆయన ఇంటర్ ఎడ్యుకేషన్‌కు పెద్దగా టైమ్ ఇవ్వడం లేదు. పుస్తకాల ఫాలో అప్ అంశాన్ని కిందిస్థాయి అధికారులకు అప్పగించడంతోనే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది.
ఆర్డర్ ఇచ్చినా ప్రింటింగ్ చేయలె..
ఇంటర్మీడియెట్ అధికారులు 2023–24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన పుస్తకాల కోసం ఏప్రిల్‌లోనే తెలుగు అకాడమీకి లెటర్ పెట్టారు. అయితే, అకాడమీ అధికారులు ఆ విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టున్నారు. ఇప్పటికీ పుస్తకాల ప్రింటింగ్ పూర్తిచేయలేదు. గతేడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలలకు పుస్తకాలు కాలేజీలకు వెళ్లాయి. అప్పుడూ అకాడమీ అధికారుల నిర్లక్ష్యంపై సర్కారు పెద్దలు పట్టించు కోలేదు. పేపర్ కోసం అకాడమీ అధికారులు సకాలంలో టెండర్లు పిలువలేదని, ఆలస్యంగా టెండర్లు ఖరారు చేయడంతో ఇప్పుడిప్పుడే ప్రింటింగ్ మొదలైనట్టు సమాచారం. దీంతో స్టూడెంట్లకు పుస్తకాలు అందాలంటే మరో నెల రోజులు టైమ్ పట్టే అవకాశం ఉంది. కాగా, పుస్తకాలపై స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రివ్యూ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోవడం గమనార్హం.