
- బార్ కౌన్సిల్ నుంచి లభించని అనుమతులు
- ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అభ్యర్థుల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం అడ్మిషన్లు ఈఏడాది కూడా ఆలస్యంగానే మొదలవనున్నాయి. టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు దాటినా, ఇప్పటికీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌పై స్పష్టత రాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2022–23 అకాడమిక్ ఇయర్లో మూడేండ్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లకు జులై 21, 22 తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించారు. ఆగస్టు17న ఫలితాలు ప్రకటించారు. 28,921 మంది లాసెట్ రాయగా.. 21,662 క్వాలిఫై అయ్యారు. దీంట్లో మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు చెందిన 15,031 మంది, ఐదేండ్ల ఎల్ఎల్బీ బీకోర్సుకు చెందిన 4,256 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు చెందిన 2,375 మంది ఉన్నారు. కాగా, స్టేట్ వైడ్‌గా ఐదు వర్సిటీలో 26 లా కాలేజీలున్నాయి. వీటిలో 12 బ్రాంచులున్నాయి.
ముగుస్తున్న డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నుంచి లా కాలేజీలకు గుర్తింపు రాకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగుస్తున్నది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఎల్ఎల్బీ ఐదేండ్ల కోర్సులో సీటు రాకపోతే, దోస్త్ అడ్మిషన్ల ప్రాసెస్ పూర్తయితే డిగ్రీ చేరే అవకాశం కూడా పోతుందని వాపోతున్నారు. అధికారులు లేట్‌గా బార్ కౌన్సిల్‌కు అప్లై చేయడంతోనే, ఈ సమస్య తలెత్తిందని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది లేట్‌గా లాసెట్ అడ్మిషన్లు ప్రారంభమవున్నాయని చేస్తున్నారు. బీసీఐ నుంచి అనుమతులు రావాలంటే మరో 2వారాల టైమ్ పట్టే చాన్స్ ఉంది. బార్ కౌన్సిల్ అధికారులతో మాట్లాడామని, త్వరలోనే గుర్తింపు పొందిన కాలేజీల లిస్ట్‌ను ఇస్తామని చెప్పినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. లిస్టు రాగానే వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెడ్తామని వెల్లడించారు.