ఖమ్మం జిల్లాలో క్లైమాక్స్ కు సుడా మాస్టర్ ప్లాన్ .. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఆఫీసర్ల కసరత్తు

ఖమ్మం జిల్లాలో క్లైమాక్స్ కు సుడా మాస్టర్ ప్లాన్ .. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఆఫీసర్ల కసరత్తు
  • గ్రీన్​ సిగ్నల్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
  • కొన్ని మార్పులు సూచించిన మంత్రి పొంగులేటి 
  • పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ ఇవ్వాలని సూచన 
  • పాత సుడా పరిధిలోనే మాస్టర్​ ప్లాన్ తయారీ 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని స్తంభాద్రి అర్బన్​ డెవలప్​ మెంట్ అథారిటీ (సుడా) మాస్టర్​ ప్లాన్​ వ్యవహారం క్లైమాక్స్​ కు చేరింది. దాదాపు ఆరేండ్లకు మాస్టర్ ప్లాన్​ తయారీ తుది దశకు చేరగా, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు ఇప్పటికే ఆఫీసర్లు దీనిపై వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే మాస్టర్ ప్లాన్​ గ్రీన్​ సిగ్నల్ ఇవ్వగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాత్రం కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్టు సమాచారం. కొన్ని రోడ్లు వెడల్పు లేకపోవడం, ఫీల్డ్ లో ఉన్న కొన్ని రహదారులు మాస్టర్ ప్లాన్​ లో కనిపించకపోవడం లాంటి పాయింట్స్ ను లేవనెత్తినట్టు తెలిసింది. 

పాత శాటిలైట్ ఇమేజెస్​ ఆధారంగా తయారు చేసింది కావడంతో కొన్ని మిస్​ అయ్యాయని, వాటిని సరిచేస్తామని ఆఫీసర్లు వివరణ ఇచ్చారు. ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయడంతో పాటు పొంగులేటి సూచన మేరకు త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ ఇచ్చేందుకు సుడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ ఓకే అయితే ఒకట్రెండు వారాల్లోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

పాత ‘సుడా’ పరిధిలోనే..!

2017 అక్టోబర్​ లో ఖమ్మం కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీ​తో పాటు వైరా, పాలేరు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 46 గ్రామాలను కలుపుతూ 571.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ‘సుడా’ను ఏర్పాటుచేశారు. ఇందులో ఖమ్మం కార్పొరేషన్​ 94.43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. గతేడాది నవంబర్​ లో మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలతో పాటు 17 మండలాల్లోని 279 గ్రామాలను కూడా సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లాలోని కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మండలాలు మినహాయించారు. 

అయితే ప్రస్తుత మాస్టర్​ ప్లాన్​ తయారీలో కొత్తగా సుడా పరిధిలోకి తీసుకువచ్చిన మండలాలను పరిగణనలోకి తీసుకోలేదు. అంతకు ముందున్న సుడా లిమిట్స్​ లోనే మాస్టర్​ ప్లాన్​ ను ‘స్టెమ్’ అనే సంస్థ రూపొందించింది. దాదాపు ఆరేండ్ల నుంచి ఈ మాస్టర్​ ప్లాన్​ తయారీ కసరత్తు కొనసాగుతోంది. కోవిడ్ సహా పలు కారణాలతో ఇన్నేండ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. జియోగ్రాఫిక్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​(జీఐఎస్) బేస్​ తో గూగుల్ మ్యాప్​ ఆధారంగా, వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో​ రానున్న 20 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా దీన్ని తయారు చేస్తున్నారు. 

20 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా..!

మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుడా పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం ​4,56,000 మంది ఉండగా, 2042 నాటికి ఈ జనాభా 20,76,000కు  పెరుగుతుందని అంచనా వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లు, మౌలిక సదుపాయాలు, హైవేల అనుసంధానం, రైల్వే లైన్​, ఇతర అంశాలను బేరీజు వేసుకుంటూ జోన్​ లను తయారు చేస్తున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రీక్రియేషన్, పబ్లిక్, సెమీ పబ్లిక్​ జోన్​ లు, రోడ్లు, వాటి వెడల్పు, చెరువులు, కాలువలు, వాగుల వివరాలన్నీ మాస్టర్ ప్లాన్ లో ఉంటాయి. 

డ్రాఫ్ట్ నోటిఫికేషన్​ ఇచ్చిన తర్వాత స్టేక్​ హోల్డర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల అభిప్రాయాల ప్రకారం మార్పులు చేసి ఫైనల్ నోటిఫికేషన్​ ను రిలీజ్​ చేస్తారు. 2022లో మాస్టర్​ ప్లాన్​ సిద్ధం చేసి ఆ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి స్టేక్ హోల్డర్ల మీటింగ్ నిర్వహించారు. అందులో వచ్చిన సూచనలతో అదే ఏడాది జులైలో రెండో సమావేశం నిర్వహించి సలహాలు స్వీకరించారు. అప్పుడే ముసాయిదా పబ్లిష్ చేయాల్సి ఉన్నా, సవరణల కోసం అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. ఖమ్మం కార్పొరేషన్​ లిమిట్స్​ లో ప్రస్తుతం 40 ఏండ్ల కింద రూపొందించిన మాస్టర్ ప్లాన్​ ప్రకారమే పర్మిషన్లు ఇస్తుండడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. 

20 నెలలుగా పాలకవర్గమే లేదు..!

సుడాకు తొలిసారి 2020 జూన్​ లో పాలకవర్గాన్ని నియమించారు. 2023 డిసెంబర్​ లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత సుడా పాలకవర్గాన్ని రద్దుచేశారు. అప్పుడు చైర్మన్​ తో పాటు 14 మంది డైరెక్టర్లుండగా, ఆ తర్వాత సుడా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో దాదాపు 20 నెలల నుంచి సుడా పాలకవర్గం లేకుండాపోయింది. చాలా మంది నేతలు సుడా చైర్మన్​ పీఠంపై ఆశలు పెట్టుకున్నా, జిల్లాలోని ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో నియామకం ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.