ఖమ్మం: రాష్ట్రంలో పలుచోట్ల అకాలవర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పంట నష్ట పోయింది. జిల్లాలో ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోని పలు మండలాల్లో వర్షం కురిసింది. కారేపల్లి, కరకగూడెం, మణుగూరు, చండ్రుగొండ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. రైతులు ఉరుకులు పరుగులు తీశారు. మిరప రైతులు మిర్చి కోసి కల్లాల్లో ఉండగా, మరికొంత మంది రైతుల పంటలు కోత దశలో ఉన్నాయి. కల్లాల్లో ఉన్న మిర్చి తడవకుండా పట్టాలు కప్పుకొని కాపాడుకున్నారు. కోత దశలో ఉన్న తోటలు వర్షంతో తడిసిపోవడంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందారు. మిరప పంటతో పాటూ పత్తి పంటలకు కొంత నష్టం వాటిల్లింది. వర్షానికి వీధులలోని అంతర్గత రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎండల తీవ్రతతో వేడిగా ఉన్న వాతావరణం వర్షం రాకతో ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో ఏర్పడిన ఇంధ్రధనస్సును చూస్తూ చిన్నలూ, పెద్దలు సంబురపడ్డారు. ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడడం, వర్షం పడడంతో కొంత ఉపశమనం పొందారు.
