తెలుగు బిగ్బాస్:అర్జున్ పై చంటి సెటైర్లు

తెలుగు బిగ్బాస్:అర్జున్ పై చంటి సెటైర్లు

కెప్టెన్సీ టాస్క్ యమ జోరుగా సాగుతోంది. గ్లవుజ్‌ చేజిక్కించుకుని తమకు నచ్చనివారిని పోటీ నుంచి తొలగించే అవకాశం బిగ్‌బాస్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు హుషారుగా రియాక్టయ్యారు. పోటీపడి కొందరిని గేమ్ నుంచి బైటికి పంపేశారు. ఇవాళ కూడా ఈ టాస్క్ కంటిన్యూ కానుంది. మరి పోటీలో చివరి వరకు నిలిచిందెవరు? కెప్టెన్ అయ్యిందెవరు?

శ్రీహాస్ సొద.. రేవంత్ రొద

ఇనయాతో గొడలు ఎక్కువై నాగార్జున దగ్గర మొట్టికాయలు పడినప్పటి నుంచి శ్రీహాన్ కొత్త పర్‌‌ఫార్మెన్స్ మొదలెట్టాడు. ఒంటరిగా ఉండటం, తనలో తనే మాట్లాడుకోవడం చేస్తున్నాడు. ఇవాళ కూడా ఎపిసోడ్ మొదలవగానే సొద స్టార్ట్ చేశాడు. కెప్టెన్సీ టాస్కులో ఇంకా ఎలిమినేట్ అవ్వకుండా అక్కడ ఉన్న ఫొటోల దగ్గరికి వెళ్లి.. ఒక్కొక్కరినీ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు. తన ఫొటో దగ్గర కాసేపు నిలబడి.. నిన్ను కొట్టాలని చాలామంది చూస్తున్నారు, జాగ్రత్త అంటూ తెగ జీవించాడు. అదేదో చాలా స్కోరింగ్ అని అతను అనుకుంటున్నాడేమో కానీ చూసేవాళ్లకి మాత్రం కావాలనే చేస్తున్నాడనిపిస్తోంది. ఒక్కోసారి అతని మాటలు వింటుంటే తన తప్పుల్ని కవర్ చేసుకోలేక ఇన్‌ఫీరియారిటీతో అలా చేస్తున్నాడేమో అని కూడా అనిపిస్తోంది. ఇక రేవంత్‌ రొద ఎప్పుడూ ఉండేదే. ఇంట్లో తనొక్కడే పని చేస్తున్నాడని, మిగతా వాళ్లు కష్టపడటం లేదని ఫీలవుతుంటాడు. చెప్పినవాళ్లే పని చెప్తారు, మిగతావాళ్లకి కూడా చెప్పండి అని ప్రతి కెప్టెన్‌తో టీ గొడవకు దిగుతుంటాడు. ఇవాళ ఆదిరెడ్డితోనూ పెట్టుకున్నాడు. ఆదిరెడ్డి మొదట మెల్లగా వివరించినా రేవంత్ వాయిస్ రెయిజ్ చేసేసరికి అతనూ గట్టిగానే అరిచాడు. నువ్వు కెప్టెన్ అయినప్పుడు ఏం చెప్పినా నేను నోరు మూసుకుని వింటా, ఇప్పుడు నువ్వు కూడా విను అని చెప్పాడు. కామెడీ ఏంటంటే.. నిన్న రేవంత్ నిద్రపోతుంటే కుక్కలు మొరిగాయి. అది పక్కనున్నవాళ్లూ చూశారు. ప్రేక్షకులూ చూశారు. కానీ తానసలు నిద్రే పోలేదని దారుణంగా అబద్ధమాడేస్తున్నాడు రేవంత్. అది నిజం కాదని ఇవాళ కూడా ఆదిరెడ్డిదో వాదనకు దిగాడు.

గీత దాటట్లేదు కదా!

ఇప్పటికే బిగ్‌బాస్‌లో వల్గారిటీ పెరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ ఆరోహి, సూర్యల వ్యవహారం రచ్చవుతోంది. శ్రీసత్య విషయంలో అర్జున్ కళ్యాణ్ తీరు కూడా ఒక్కోసారి విసుగు తెప్పిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టు ఇవాళ ఫైమా గ్యాంగ్ చేసిన అల్లరి కూడా అదో మాదిరిగా ఉంది. రాజ్, ఫైమా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతలో ఫైమా భుజమ్మీద రాజ్ చేయి వేశాడు. ఆడపిల్ల మీద చేయి వేస్తావా అంటూ పక్కనే ఉన్న శ్రీసత్య సరదాగా అంది. అంతే.. ఇక ఫైమా అందుకుంది. అయ్యో బైటికెళ్లాక నా పరిస్థితి ఏంటి, మొన్న నా నడుము కూడా గిల్లాడు అంటూ హడావుడి స్టార్ట్ చేసింది. అవునా, తనని పెళ్లెవరు చేసుకుంటారు, నువ్వు చేసుకుంటావా అంటూ శ్రీసత్య ఏడిపిస్తుంటే రాజ్‌ తెగ సిగ్గుపడిపోయి నవ్వేసుకోవడం కనిపించింది. మొన్న కూడా రాజ్‌కి స్వయంవరం అంటూ కామెడీ చేశారు. ఇప్పుడేమో ఇది. ఇక ఆరోహి, సూర్య ఇవాళ కూడా కాస్త ఫుటేజ్ ఇచ్చారు. అమ్మ గుర్తొచ్చిందంటూ ఓ మూలకి పోయి ఏడుపు మొదలెట్టాడు సూర్య. ఆరోహి వెళ్లి ఓదార్చడం మొదలెట్టింది. ఆమె వెళ్లిపోయాక కీర్తి వచ్చి కాసేపు ఓదార్చింది. ఆమె కూడా వెళ్లిపోయాక నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి సూర్యా అంటూ మళ్లీ పర్‌‌ఫార్మెన్స్ మొదలెట్టాడు సూర్య. కామెడీ ఏంటంటే.. ఏ కాస్త సందు దొరికినా సూర్య దగ్గర చేరి అతి చేసే ఆరోహి.. అర్జున్, శ్రీసత్యల్ని తప్పుబట్టడం. డబ్బులిస్తే శ్రీసత్య ముద్దులు పెడతానందట అని కీర్తి చెబుతుంటే.. ఇలాంటి వాళ్లని హౌస్‌లోంచి పంపేయాలి అంటోంది ఆరోహి. ఓ టాస్క్ విషయంలో చేసినదానికే ఇలా అంటే.. మరి వీళ్లు అస్తమానం అదే చేస్తున్నారు కదా, వీళ్లనేం చేయాలో. ఏదేమైనా ఈ సీజన్‌లో అశ్లీలత ఎక్కువుందంటూ ఆల్రెడీ ఒకరు కోర్టుకు వెళ్లారని, కోర్టు సీరియస్ అయ్యిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి కంటెంట్‌ని కాస్త తగ్గించడం మంచిదేమో!

ఆరోహి కోరిక.. శ్రీహాన్‌కి తప్పలేదిక!

కాసేపు అందరూ కబుర్లాడుకున్న తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టమని పిలిచాడు బిగ్‌బాస్. దాంతో మళ్లీ పంచ్ పడింది గేమ్ స్టార్ట్ అయ్యింది. కెప్టెన్స్ కి  రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే కారణంతో అర్జున్ కళ్యాణ్ తనని తప్పించడంతో ఆరోహి బాగా ఫీలయ్యింది. తాను అందరి కోసం స్టాండ్ తీసుకుంటున్నానని, తనకోసం ఎవ్వరూ నిలబడటం లేదని పాత పాటే పాడింది. ఆ తర్వాత ఇనయా గ్లవుజ్‌ పట్టుకుని వచ్చి కాసేపు యాటిట్యూడ్ చూపించింది. ఆ తర్వాత మిమ్మల్ని నేను ఎందుకు ఎలిమినేట్ చేయకూడదో చెప్పండి అంటూ అందరినీ అడిగింది. ఎవరి రీజన్స్ వాళ్లు చెప్పుకున్నారు. ఆపైన ఆమె శ్రీహాన్‌ ఫొటోకి పంచ్ ఇచ్చింది. ఒకమ్మాయి ఇంటికి కెప్టెన్ అవ్వాలన్నదే తన కోరిక తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పింది. అదే రీజన్ అయితే ఐ రెస్పెక్ట్ యు అంటూ పాజిటివ్‌గా రియాక్టయ్యాడు శ్రీహాన్. అయితే బ్యాడ్జ్ పెట్టేయడానికి స్టోర్ రూమ్‌కి వెళ్లి అక్కడ కాసేపు తన నటనను ప్రదర్శించాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తెగ తుడిచేసుకున్నాడు. తను చెప్పిన రీజన్ వేలీడ్ కనుక యాక్సెప్ట్ చేయాలి అని ఓ డైలాగ్ కొట్టి బైటికొచ్చేశాడు. ఆ తర్వాత అతను వెళ్లి రోహిత్‌ని ఎలిమినేట్ చేశాడు. ఇనయా చెప్పినదానికి ఒప్పుకుని సగం బాధ్యత పూర్తి చేశాను, ఇక ఉన్నది నువ్వొక్కడివే మగాడివి కాబట్టి నిన్ను కూడా తొలగిస్తే పూర్తిగా మాట నిలబెట్టుకున్నవాడిని అవుతాను, వాళ్లకి కూడా పోటీపడటం ఈజీ అవుతుంది అని చెప్పడంతో రోహిత్ కూడా ఓకే అన్నాడు. 

కొత్త కెప్టెన్ తనే!

ఆట ముగిసే సమయానికి సుదీప, కీర్తి, శ్రీసత్య మిగిలారు. దాంతో ఆ ముగ్గురికీ కెప్టెన్ పదవి కోసం పోటీ పెట్టాడు బిగ్‌బాస్. రెండు బ్రిక్స్ సాయంతో నడచుకుంటూ వెళ్లి.. టబ్బులో ఉన్న అక్షరాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి కెప్టెన్ అనే పదాన్ని కూర్చాలి. ఎవరు ముందు కూర్చితే వాళ్లే విన్నర్. సో ముగ్గురూ పోటీపడ్డారు. శ్రీసత్య మొదట ఫాస్ట్ గా కనిపించింది. అయితే రెండు అక్షరాలు పెట్టిన తర్వాత స్లో అయిపోయింది. సుదీప వేగంగానే ఆడింది. అయితే కీర్తి ఈ ఇద్దరినీ డామినేట్ చేసింది. జాగ్రత్తగా, టెన్షన్ పడకుండా ఆడింది. దాంతో మిగతా ఇద్దరి కంటే ముందే టాస్క్ పూర్తి చేసింది. కెప్టెన్సీ చెయిర్‌‌లో కూర్చుంది. ఆ తర్వతా కాసేపు ఎమోషనల్ అయ్యింది. నిజానికి కీర్తి ఆట చాలా డల్‌గా ఉంటోంది. పెద్దగా పార్టిసిపేట్ చేయదు. యాక్టివ్‌గా కనబడదు. సింపథీ కార్డ్ ప్లే చేస్తోందనూ కామెంట్స్ కూడా మూటగట్టుకుంది. అందుకే నాగార్జున కూడా డైరెక్ట్ నామినేట్ చేశారు. అలాంటి కీర్తికి కెప్టెన్ పదవి దక్కడమంటే చాలా అదృష్టమని చెప్పాలి. ఇప్పుడైనా తను కాస్త ప్రూవ్ చేసుకుంటే ఓట్లు పడతాయి. సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటిని ఎలా నడిపిస్తుందో చూడాలి మరి.

అతనే టార్గెట్

ఇక చివర్లో ఈ వారం వరస్ట్ పర్‌‌ఫార్మర్ ఎవరో సెలెక్ట్ చేసి జైలుకు పంపమని చెప్పాడు బిగ్‌బాస్. అక్కడో బాక్స్ పెట్టాడు. తాము జైలుకు పంపాలనుకున్న వ్యక్తి పేరు ఓ కాగితం మీద రాసి అందులో వేయాలి. ఈ ప్రాసెస్‌లో ఎక్కువమంది అర్జున్‌ని టార్గెట్ చేశారు. అతను ఆట సరిగ్గా ఆడలేదని, శ్రీసత్య విషయంలో పక్షపాతధోరణి ప్రదర్శించాడని, గేమ్‌ని తన ఇష్టానుసారం వాడుకున్నాడని.. ఇలా అందరూ దాదాపు ఒకటే రీజన్‌ని చూపించారు. దాంతో అర్జున్‌ జైలుకు వెళ్లాడు. అయితే ఇలా జరిగినందుకు ఫీలవుతూ కనిపించాడు. పోయినసారి ఆడపిల్లల్ని జైలుకు పంపడం ఇష్టం లేక నేను వాలంటరీగా జైలుకు వచ్చాను, అలాంటిది అందరూ కలిసి తననిలా చేయడం అన్యాయం అని బాధపడ్డాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను, నన్ను సేవ్ చేయండి అంటూ ప్రేక్షకుల్ని రిక్వెస్ట్ కూడా చేశాడు. శ్రీసత్య కూడా ఈ విషయంలో సూటిగా రియాక్టయ్యింది. నువ్వు నాకోసం వచ్చావా నీ కోసం వచ్చావా అంటూ అతనిని ప్రశ్నించింది. నువ్వు నాకు సపోర్ట్ చేసినందుకే ఇలా జరిగింది, ఇకపై నువ్వు నామీద జాలి పడకు, నీ ఆట నువ్వు ఆడు అంటూ క్లాస్ పీకింది. ఇంట్లోవాళ్లందరూ కూడా దీనిపై రకరకాలుగా చర్చించుకున్నారు. గుంపులు గుంపులుగా విడిపోయి ఇంకా చాలా విషయాలపై డిస్కస్ చేశారు. శ్రీసత్య వెనుక పడిన అర్జున్ మీద చంటి సెటైర్లు వేసి నవ్వించాడు. ఇన్నాళ్లూ ఇనయాని ఆడిపోసుకున్న గీతూ ఇప్పుడు చంటిని టార్గెట్ చేస్తోంది. అతనసలు హౌస్‌లో ఉండటం వేస్ట్ అని, పంపేయడం బెటరని చెబుతోంది.

మొత్తానికి ఈవారం ఇలా గడిచింది. రేపు నాగార్జున రాకతో గేమ్ మొత్తం మారుతుంది. వారమంతా చాలా విషయాలు జరిగాయి కాబట్టి కచ్చితంగా కొందరికి స్పెషల్ క్లాసులు తప్పవనిపిస్తోంది. ఎలిమినేషన్‌లోనూ చాలామంది ఉన్నారు. అర్జున్ కళ్యాణ్ కానీ సుదీప కానీ వెళ్లిపోతారని చాలామంది అంటున్నారు. ఆరోహి కారణంగా ఆటని నిర్లక్ష్యం చేస్తున్న ఆర్జే సూర్య పట్ల కూడా చాలా వ్యతిరేకత ఏర్పడటంతో అతనికీ తక్కువ ఓట్లు పడే అవకాశం ఉందనేది కొందరి వాదన. మరి వీటిలో ఏది నిజమవుతుందో! ఎవరికి వేటు పడుతుందో!