తెలుగు బిగ్ బాస్ : కెప్టెన్సీ కుర్చీలో రాజ్ 

తెలుగు బిగ్ బాస్ : కెప్టెన్సీ కుర్చీలో రాజ్ 

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలక్షన్ల హడావుడి కూడా కొనసాగింది. ప్రచారాలు, ఓట్లు అంటూ హౌస్‌మేట్స్ అంతా బిజీబిజీగా గడిపారు. మధ్యలో బిగ్‌బాస్ వేసిన పాటలు.. దానికి ఇంటి సభ్యులందరూ వేసిన స్టెప్పులతో ఇల్లంతా సందడి సందడిగా మారిపోయింది.

రాజ్‌కి ఓట్లు.. ఇనయా పాట్లు

నిన్నటి ఎపిసోడ్‌లో ఎక్కువ ఓట్లు రాజ్‌కు పడ్డాయి. అతను కెప్టెన్ అయ్యి ఇంటిని నడిపించేంత స్ట్రాంగ్ కాకపోయినా.. నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఒక్క చాన్స్ ఇస్తే బాగుంటుందని చాలామంది ఫీలయ్యారు. అందుకే తనవైపు మొగ్గు చూపారు. చివరికి పోటీలో ఉన్న చంటి, ఇనయా, సూర్య కూడా యునానిమస్‌గా రాజ్‌ని గెలిపించేద్దాం అని డిసైడయ్యారు. కానీ, సూర్యకు ఓట్లు పడుతూ ఉంటే ఇనయా చాలా ఫీలైపోయింది. తనకి ఒక్క ఓటు కూడా రాలేదని, తన కష్టమంతా వృథా అయిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ టైమ్‌లో ఇనయా డబుల్ స్టాండర్డ్స్ బయటపడ్డాయి. టాస్క్ లో రాజ్‌ తప్పు చేస్తే సపోర్ట్ చేసి గెలిపించాను, కానీ ఇప్పుడు తనకి కెప్టెన్సీ ఇచ్చి నేను ఓడిపోవాలా అన్నట్టు మాట్లాడింది. ఇది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే టాస్క్ సమయంలో రాజ్ తప్పు చేశాడనే చర్చ వచ్చినప్పుడు అలాంటిదేం లేదని అందరూ అన్నారు. ఆరోహితో మాట్లాడుతూ సంచాలకురాలిగా నేనేదైనా తప్పు చేశానా అని ఇనయా అడిగితే కూడా ఆమె అదేం లేదంది. మరి ఇప్పుడు తన అవసరం కోసం మాట మార్చేసి, రాజ్ తప్పు చేస్తే నేను గెలిపించాను అనడం ఎంతవరకు కరెక్టో ఇనయాకే తెలియాలి. అటు వైపు రాజ్‌ మాత్రం ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఎంతో హుందాగా ప్రవర్తించాడు. తనకి కెప్టెన్ అవడానికి సరిపడా ఓట్లు వచ్చేశాయి కాబట్టి.. మిగతా రెండు ఓట్లు ఇనయాకి వేస్తే సంతోషపడుతుందని, ఆమెని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని అందరినీ రిక్వెస్ట్ చేశాడు. అది తెలిస్తే అయినా తాను ఆలోచించే పద్ధతి, మాట్లాడే విధానం ఎంత తప్పో ఇనయాకి అర్థమవుతుందేమో. ఏదేమైతేనేం.. ఆమె కన్నీటి ప్రహసనానికి ఫలితం దక్కింది. ఆరోహి, నేహ కలిసి ఒక ఓటు వేశారు. చివరికి మాత్రం అందరూ కలిసి రాజ్‌ని కెప్టెన్సీ కుర్చీ ఎక్కించారు. 

ఆ అమ్మాయితో స్పెషల్ ఎంట్రీ..

ఈ సీజన్‌లో మొదటిసారిగా హౌస్‌లోకి గెస్టులు వచ్చారు. వాళ్లెవరో కాదు.. సుధీర్‌‌ బాబు, కృతిశెట్టి. వాళ్లిద్దరూ కలిసి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ శుక్రవారం మూవీ విడుదలైంది. ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు, కృతిశెట్టి హౌస్‌లో అడుగుపెట్టారు. మూవీలో తానో డైరెక్టర్, కృతి యాక్ట్రెస్ కాబట్టి నటనలో పోటీ పెడతామన్నాడు సుధీర్. ముందుగా రేవంత్ మహేష్‌బాబుని ఇమిటేట్ చేస్తూ పండుగాడి డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేశాడు. ‘బుజ్జిగాడు’ సినిమాలోని ప్రభాస్ తమిళ డైలాగ్‌ చెప్పి అదరగొట్టింది గీతూ. ఆ తర్వాత అదే డైలాగ్‌ ను తన స్టైల్లోనూ చెప్పి ఆకట్టుకుంది. ఇక ఫైమా, శ్రీహాన్ అయితే ‘పోకిరి’ పేరడీని అద్భుతంగా చేశారు. మహేష్, ఇలియానా లిఫ్ట్లో ఇరుక్కుపోయిన సీన్‌ని తీసుకుని.. తాము బాత్రూమ్‌లో ఇరుక్కుపోయినట్టుగా మలచుకున్నారు. అక్కడ వాళ్లు చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బ అందర్నీ నవ్వించాయి. తర్వాత ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ సీన్‌లో రవితేజ బదులు విజయ్ దేవరకొండ ఉంటే ఎలా ఉంటుందో సూర్య చేసి చూపించాడు. చూడటానికి బాగానే ఉన్నా బ్రహ్మానందం పాత్రలో చంటి కాస్త అతి చేశాడనిపించింది. దీనికంటే ముందు పవన్‌ కళ్యాణ్‌ని సూర్య ఇమిటేట్ చేసిన తీరుకు సుధీర్ చాలా ఇంప్రెస్ అయిపోయాడు. రాజకీయాల్లో బిజీగా ఉండి పవన్ ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పలేకపోతే నిన్ను పంపేయొచ్చు అంటూ మెచ్చుకున్నాడు. ఇక తన ‘ప్రేమకథా చిత్రం’లోని సీన్‌ని చేసి చూపించమని సుధీర్ కోరడంతో ఆ స్కిట్‌ కూడా వేయడం జరిగింది. దెయ్యం పట్టిన నందిత పాత్రలో శ్రీసత్య, సుధీర్ క్యారెక్టర్‌‌లో రాజ్ కనిపించారు. మధ్యలో సప్తగిరిలా ఎంటరైన శ్రీహాన్ అచ్చం అతనిలాగే కామెడీ చేసి మెప్పించాడు. చివరికి శ్రీహాన్‌కే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు సుధీర్, కృతి. బెస్ట్ యాక్ట్రెస్‌గా శ్రీసత్యను ప్రకటించారు. తమ టైమ్ అయిపోవడంతో అందరికీ బై చెప్పి వెళ్లిపోయారు. 

పనీ పాటా.. రేవంత్ చిటపట

పని చేసిన వాళ్లే చేస్తున్నారు.. మిగతావాళ్లు తప్పించుకుంటున్నారనే పాయింట్‌ మీద రేవంత్‌ చిటపటలాడుతున్నాడు. శ్రీహాన్‌తో దీని గురించి చాలాసేపు డిస్కస్ చేశాడు. బాత్రూమ్ కడగాల్సి వస్తే ఇంటికైనా వెళ్లిపోతాను కానీ కడిగేది లేదని చంటి చెప్పేశాడని, అలాంటి వాళ్లతో పని చేయించాలి గానీ అతని పని వేరే వాళ్లతో చేయించడమేంటని ప్రశ్నించాడు. ఫైమా కూడా కబుర్లు చెప్పడం, కామెడీ చేయడం తప్ప ఏ పనీ చేయడం లేదని, అన్నీ చేస్తున్న తమలాంటి వాళ్లమీదే పని భారం పడుతోందని, ఇది కరెక్ట్ కాదని, కెప్టెన్ మాటను గౌరవించి మౌనంగా ఉన్నానని అన్నాడు. అతని మాటల్ని శ్రీహాన్ సమర్థించాడు. సమయం వచ్చినప్పుడు తాను కూడా గట్టిగా మాట్లాడతానని అన్నాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో బాత్రూమ్స్‌ పద్ధతిగా లేవని, సర్దుదాం రమ్మని బాలాదిత్య పిలిచాడు. అప్పుడు రేవంతో గట్టిగానే ఖండించాడు. చేస్తున్న వాళ్లకే పని చెప్తారేంటి..? అందరితో చేయించండి అన్నాడు. అలా అని తాను చేయనని చెప్పలేదు. వెళ్లి కెప్టెన్ చెప్పిన పని చేశాడు. బట్టలు మడతపెడితే చాలు.. అన్నీ శుభ్రం చేయక్కర్లేదు అని బాలాదిత్య చెబుతున్నా.. చేస్తే పూర్తిగా చేద్దాం.. సగం సగం ఎందుకు అంటూ శ్రద్ధగా వర్క్ చేశాడు. అయితే తాను కెప్టెన్ అయినరోజున మాత్రం ఈరోజు తనతో తమ పనులన్నీ చేయిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతానని అన్నాడు. చెప్పే విధానం తప్పుగా అనిపిస్తోందేమో కానీ రేవంత్ మాట్లాడిన పాయింట్‌ మాత్రం కరెక్టే. కొందరు మాత్రమే పని చేస్తున్నారు. కొందరు టైమ్ పాస్ చేస్తూ తప్పించుకుపోతున్నారు. కానీ, రేవంత్ చెబుతున్న విధానం వల్ల అతనేదో గలాటా చేస్తున్నాడనే కలర్ ఇస్తున్నారు కొందరు హౌస్‌మేట్స్. అతను ఒకే పాయింట్ పట్టుకుని లాగుతూ ఉంటాడని, అతనితో మాట్లాడటం తనకసలు ఇష్టం ఉండదని ఇనయా అనడమే అందుకు ఉదాహరణ. 

ఏదేమైనా అందరూ అందరికీ నచ్చరు. తమకి నచ్చినవాళ్లు మంచోళ్లూ కాదు. నచ్చనివాళ్లు చెడ్డోళ్లూ కాదు. అది హౌస్‌మేట్స్ అర్థం చేసుకోలేకపోయినా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయం చెప్పగలరు. ఇది తెలిసి కూడా హౌస్‌మేట్స్ ఒకరినొకరు నిందించుకోవడం అనవసరం కదా. అయినా.. ప్రతి ఒక్కరిలోనూ  ప్లస్సులూ, మైనస్సులూ రెండూ ఉంటాయి. ఏది ప్లస్.. ఏది మైనస్ అనేది తెలుసుకుంటే చాలు. ఏం చేయాలో.. ఎలా ఉండాలో అర్థమైపోతుంది. అలా తెలుసుకోలేకపోతే హెల్ప్ చేయడానికి ఎలాగూ అక్కినేని నాగార్జున వస్తారు. ఆయన ఈసారి ఎవరి ఒప్పుల్ని మెచ్చుకుంటారో, ఎవరి తప్పుల్ని సరిచేస్తారో ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాలి మరి.