
Sugar Stocks Rally: సెప్టెంబర్ నెలను లాభాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న మార్కెట్లలో ఒక్కసారిగా షుగర్ స్టాక్స్ ఉదయం నుంచి తిరుగులేని ర్యాలీని చూస్తున్నాయి. వాస్తవానికి ఒక్కసారిగా స్టాక్స్ పెరగటానికి అసలు కారణం మోడీ సర్కార్ తీసుకున్న నిర్మయంగా తెలుస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చెరుకు రసం, షుగర్ సిరప్, మెులాసిస్ నుంచి ఇథనల్ ఉత్పత్తిపై పరిమితులను తొలగించాలని నిర్ణయించింది. అయితే దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం చెరకు రసం, షుగర్ సిరప్ నుంచి ఇథనాల్ తయారీపై కొన్ని పరిమితులు పెట్టింది. దేశంలో చెరకు ఉత్పత్తిలో తరుగుదలతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నవంబర్ 1 నుంచి ఇథనాల్ ఉత్పత్తికి కొత్త ఏడాది స్టార్ట్ అవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన కీలకంగా మారింది. దీంతో షుగర్ మిల్లులు అపరిమితంగా ఇథనాల్ తయారీకి వెళ్లటానికి రూట్ క్లియర్ అయ్యింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా షుగర్ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం తర్వాత బలరామ్ పూర్ చిని స్టాక్ 5 శాతం పెరగగా, శ్రీ రేణుకా షుగర్స్ ఏకంగా 12 శాతం పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, గోదావరి బయోరిఫైనరీస్, ఉత్తమ్ షుగర్స్, దంపూర్ షుగర్ మిల్స్, మగద్ షుగర్ అండ్ ఎనర్జీ, ద్వారికేష్ షుగర్స్ షేర్లు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో త్రివేణి ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు కూడా 4 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేశాయి.
భారత ప్రభుత్వం దేశంలో 20 శాతం ఇధనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ప్రోత్సహిస్తూ దాని లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2023 తర్వాత వచ్చిన వాహనాలు దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం వాడకానికి వీలైనవి. అయితే అంతకు ముందు వాహనాల్లో ఈ ఇథనాల్ 20 ఫ్యూయెల్ వాడకం వల్ల ఇంజన్లు పాడవుతాయనే భయాలు వాహనదారులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అయితే కారు యజమానుల్లో మాత్రం ఇంజన్ పనితీరు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కవరేజీ వంటి అంశాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.