చెరుకు రైతులకు క్రషింగ్ కష్టాలు

చెరుకు రైతులకు క్రషింగ్ కష్టాలు
  •     ఈసారి కూడా ట్రైడెంట్ ఫ్యాక్టరీలో క్రషింగ్ లేనట్టే
  •     ఇతర ఫ్యాక్టరీలకు తరలింపుతో రవాణా భారం, ఆర్థిక ఇబ్బందులు
  •     జిల్లాలో పెరిగిన చెరుకు పంట

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు శాపంగా మారింది. గడిచిన మూడేళ్లుగా ఈ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడంలేదు. ఫ్యాక్టరీని నడిపించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు గతంలో యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీ పరికరాలను రహస్యంగా తరలించే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు అడ్డుకొని రైతుల బకాయిలు చెల్లించేందుకు ఆస్తులు వేలం వేస్తామని చెప్పారు. తర్వాత ఫ్యాక్టరీ కొనసాగిస్తామని యాజమాన్యం ప్రకటించడంతో అధికారులు వెనుకడుగేశారు. రైతులు మాత్రం క్రషింగ్ మొదలవుతుందనే ఆశతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

పెరిగిన చెరుకు సాగు..

జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగు అవుతుండగా, ఒక ట్రైడెంట్ ఫ్యాక్టరీ సమీపంలోనే 12 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. జహీరాబాద్ లోనే ప్రతి సీజన్ లో దాదాపు 7 లక్షల టన్నుల చెరుకు పండిస్తున్నారు. గతంతో పోలిస్తే గడిచిన రెండేళ్లుగా చెరుకు సాగు బాగా పెరిగింది. ట్రైడెంట్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా 4 లక్షల టన్నుల చెరుకును కామారెడ్డి జిల్లాలోని మాగీ గాయత్రి షుగర్స్, వనపర్తి జిల్లా కొత్తకోట కృష్ణవేణి షుగర్స్, సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్ కు తరలించే వెసులుబాటును సీడీసీ అధికారులు కల్పించారు.

 కోహీర్, ఝరాసంఘం, న్యాల్కల్, రాయికోడ్, వట్ పల్లి, రేగోడు మండలాల్లో సాగుచేసిన 8 వేల ఎకరాల్లో సుమారు నాలుగు లక్షల టన్నుల చెరుకును రాయికోడ్ మండలంలోని గోదావరి గంగా ఆగ్రో ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు .  వీటితోపాటు పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్రకు మరికొంత చెరుకును తరలిస్తున్నారు. 

పొరుగు రాష్ట్రాల్లో..

సంగారెడ్డి గణపతి షుగర్స్ మినహా ఇతర చెరుకు ఫ్యాక్టరీలలో  క్రషింగ్ సామర్థ్యం తక్కువగా ఉంటోంది. దీంతో మన రైతులు పక్క రాష్ట్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అక్కడి చెరుకు ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇవ్వడంలేదు. గతేడాది మన రాష్ట్రంలో టన్ను చెరుకు ధర రూ.3,090 ఇవ్వగా పొరుగు రాష్ట్రాల్లో రూ.2,500 మాత్రమే చెల్లించారు. మొదట్లో  కోత, రవాణా ఖర్చులు భరిస్తామంటూ ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెప్పి బిల్లుల చెల్లింపుల టైంలో తమను మోసం చేస్తున్నాయని బాధిత రైతులు వాపోతున్నారు. 

స్థానికంగా క్రషింగ్ సమస్య ఉండడంతో తప్పని పరిస్థితుల్లో చెరుకును కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. రెండు నెలల్లో సీజన్ మొదలుకానున్న క్రమంలో ప్రభుత్వం స్పందించి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి క్రషింగ్ స్టార్ట్ చేయించాలని చెరుకు రైతులు కోరుతున్నారు.