
- పండించిన చెరుకు మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న రైతులు
- సీడీసీకి ఆగిపోయిన ఫండ్స్, నిధుల్లేక రైతులకు సబ్సిడీ బంద్
సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ నియోజకవర్గం కొత్తూరు (బి) పరిధిలో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా నడుస్తలేదు. దీంతో అక్కడి కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) ఆఫీసు అలంకారప్రాయంగా మారింది. 2023–-24, 2024–-25 రెండు సీజన్లలో ట్రైడెంట్ యాజమాన్యం పలు కారణాలతో చెరుకు క్రషింగ్ చేపట్టలేదు. దీంతో సీడీసీకి రావాల్సిన ఫండ్స్ ఆగిపోయాయి. ఈ జోన్ పరిధిలో ట్రైడెంట్ మినహా ఇతర చెరుకు ఫ్యాక్టరీలు లేవు.
వాస్తవానికి టన్నుకు రూ.4 చొప్పున ఇటు రైతుల బిల్లులు, అటు ఫ్యాక్టరీ యాజమాన్యాల తరపున మొత్తం రూ.8 సీడీసీ ఖాతాలో వేస్తారు. రెండేళ్లుగా క్రషింగ్ లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలకు చెరుకును తరలించారు. దీంతో ఆ మొత్తం ఇతర జోన్ పరిధిలోని సీడీసీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. వాస్తవానికి సీడీసీ ఖాతాలో జమ చేసిన నిధుల నుంచి కేన్ అధికారులు రైతులకు సబ్సిడీ మీద గడ్డి మందులు, ఇతర పరికరాలను అందజేస్తుంటారు. అవసరం ఉన్నచోట చెరుకు తోటల వరకు తాత్కాలిక రోడ్లను వేస్తారు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో రెండేళ్లుగా జహీరాబాద్ సీడీసీ అకౌంట్ లో పైసలు జమ కాకపోగా స్థానిక రైతులకు సబ్సిడీపై ఎలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు.
కార్మికుల వేతనాల ఇష్యూ
జహీరాబాద్ జోన్ పరిధిలో దాదాపు 8 లక్షల టన్నుల చెరుకు క్రష్ అయ్యేది. ట్రైడెంట్ మూతపడడంతో ఇక్కడి చెరుకు మొత్తం పక్క రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లిపోతోంది. ట్రైడెంట్ ఫ్యాక్టరీపై ఎన్నో ఆశలు పెట్టుకొని చెరుకు పండిస్తున్న రైతులు రవాణా వ్యయం పెరిగి నష్టపోతున్నారు. పైగా అందులో పనిచేసిన కార్మికుల బకాయి వేతనాల చెల్లింపులపై కూడా ఇష్యూ జరుగుతోంది. గతేడాదిలో ప్రారంభమైన రాయికోడ్ మండలం మాటూరు షుగర్ ఫ్యాక్టరీకి 1.15 లక్షల టన్నుల చెరుకును రైతులు తరలించారు.
సంగారెడ్డిలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీకి 1.80 లక్షల టన్నులు, నారాయణఖేడ్ మాగిలోని ఫ్యాక్టరీకి 75 వేల టన్నులు, మహబూబ్ నగర్ కొత్తకోట ఫ్యాక్టరీకి 70 వేల టన్నులు, కామారెడ్డిలోని చెరుకు ఫ్యాక్టరీకి 75 వేల టన్నులు, మహారాష్ట్రకు రెండు లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ కోసం తరలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి-గంగా షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోకి న్యాల్కల్, జరాసంఘం, కోహీర్, వట్ పల్లి, రాయికోడ్ మండలాలను చేర్చారు. దీంతో జహీరాబాద్ జోన్ సీడీసీ ఆఫీసు కాస్త ఆదాయం లేక అలంకారప్రాయంగా మారింది.