
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు యలమంచిలి సుజనా చౌదరి ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు విదేశాల పర్యటనలకు హైకోర్టు అనుమతినిచ్చింది. బెస్ట్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ (బీసీఈపీఎల్) లిమిటెడ్ రూ.5 వేల కోట్ల వరకు మోసం చేసిందంటూ 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సుజనా చౌదరి నిందితుడిగా లేనప్పటికి ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో విదేశీ పర్యటనకు అవరోధంగా ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
దీనిని జస్టిస్ ఎస్.నంద ఇటీవల విచారణ జరిపారు.అమెరికా, సింగపూర్, దుబాయ్, యూరప్, బ్రిటన్, ఇతర ఆసియా దేశాల్లో పర్యటనకు అనుమతించారు. పర్యటించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు చెందినదని, జీవించే హక్కులో భాగమేనని స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణ వివరాలు, ఇ–మెయిల్, ఫోన్, బయలుదేరే తేదీ, తిరిగి వచ్చే తేదీల వివరాలను దర్యాప్తు అధికారులకు తెలపాలని పిటిషనర్‌ను ఆదేశించారు.