ఇపో (మలేసియా): అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఇండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 4–3తో మలేసియాపై గెలిచింది. సెల్వమ్ కార్తీ (7వ ని), సుక్‌జీత్ సింగ్ (21వ ని), అమిత్ రోహిడాస్ (39వ ని), సంజయ్ (53వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, మలేసియా తరఫున ఫైజల్ సారి (13వ ని), ఫిత్రి సారి (36వ ని), మర్హాన్ జాలిల్ (45వ ని) గోల్స్ కొట్టారు.
స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన ఇండియా ఎదురుదాడులతో మలేసియాపై పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. మూడో నిమిషంలో లభించించిన పెనాల్టీని వృథా చేసినా.. తర్వాత వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మ్యాచ్ మధ్యలో మలేసియా కూడా పుంజుకోవడంతో ఇరుజట్ల ప్లేయర్లు బాల్‌పై పట్టు కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే అమిత్ రోహిడాస్ పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మల్చడంతో ఇండియా పైచేయి సాధించింది. ఇక ఫైనల్ క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మలేసియా అవకాశాలను అడ్డుకున్న ఇండియా మరో గోల్ కొట్టి విజయాన్ని అందుకుంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
