
వేసవికాలం వచ్చిందటే చాలు ప్రతి ఒక్కరికీ దాహార్తి తీర్చుకోడానికి చల్లని నీరు అవసరం. వారికి రిఫ్రిజరేటర్లు అందుబాటులో ఉన్నా…. సహజ సిధ్దమైన మట్టితో చేసిన కుండలపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కుండలు, రంజన్ల లోని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కుండలు, రంజన్లు దొరుకుతున్నా… ఆదిలాబాద్ రంజన్లకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో కుమ్మరి కుటుంబాలు చాలా వరకు రంజన్ల తయారీపైనే ఆధారపడ్డాయి. ఇక్కడ తయారైన రంజన్లకు మన రాష్ట్రంతో పాటు చాలా ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. సమ్మర్ లో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి రంజన్లను కొనుగోలు చెసి తమ ప్రాంతాలకు తరలిస్తుంటారు వ్యాపారులు. ఆదిలాబాద్ రంజన్ల తయారీ వెనుక…ఏళ్ల శ్రమ దాగుంది. నల్లని బంకమట్టి, గుర్రపు లద్దెను కొనుగోలు చేసి, వాటిని చాలా రోజుల పాటు ఎండలో ఉంచుతారు. తర్వాత ఆ మట్టి పెళ్లలను రోజుల తరబడి శ్రమించి కర్రల సాయంతో పొడిగా చేస్తారు. ఇలా చేసిన నల్ల మట్టి, గుర్రపు లద్దెల మిశ్రమాన్ని నీటిలో కొంత కాలం తడిపి ఉంచుతారు. వేసవికి కొద్దిరోజుల ముందు నుంచి మట్టితో రంజన్ల తయారీ ప్రారంభిస్తారు.
మొదట ముద్దలా మార్చిన మట్టి మిశ్రమాన్ని…కుమ్మరి చక్రంపై ఉంచి, చిన్నపాటి కుండలను తయారు చేస్తారు. ఇలా చేసిన మట్టి కుండను కొద్దికాలం ఆరబెడతారు. పూర్తిగా ఆరిన తర్వాత… రంజన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బట్టీల్లో క్రమపధ్దతిలో పేర్చి, టైర్లు, చెక్కపొట్టు, కర్రల సాయంతో దోర ఎరుపురంగు వచ్చేంత వరకూ కాలుస్తారు. బట్టీల్లో రంజన్లను కాల్చడంతో.. తయారీ సమయంలో ఉపయోగించిన గుర్రపు లద్దీ పూర్తిగా కాలిపోయి కంటికి కనిపించని సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడ్డ రంధ్రాల నుంచి రంజన్ లోపలికి గాలి రావడంతో నీరు చల్లగా మారుతుంది. అయితే మొత్తం రంజన్ తయారు ప్రక్రియలో ఎక్కడా కూడా కృత్రిమ రంగులు, వస్తువులను వాడబోమని చెబుతున్నారు కుమ్మరులు.
రంజన్లకు డిమాండ్ బాగానే ఉన్నా .. లాభాలు రావట్లేదంటున్నారు తయారీ దారులు. కొన్నిసార్లు కనీసం గిట్టుబాటు ధరలు కూడా రాకపోగా…నష్టాలు వస్తున్నాయంటున్నారు. గతేడాదితో పోలిస్తే..ఈసారి ధరలు కొంత పెరిగినట్టు చెబుతున్నారు. తయీరీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు కూడా పెరగడంతో…లాభాలు తగ్గాయని అంటున్నారు. అమ్మకాల్లో దళారుల ప్రమేయం కూడా పెరిగిపోవడంతో..తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. ఆదిలాబాద్ రంజన్లకు…గట్టిపోటీనిస్తున్నాయి రాజస్థానీ కుండలు. యంత్రాలపై తయారైన కుండలను పెద్ద సంఖ్యలో మార్కెట్ కు తరలించడంతో…రంజన్ల అమ్మకాలపై ప్రభావం పడింది. మరో వైపు చెక్కపొట్టు ఏరుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లే కుమ్మరులపై ఫారెస్ట్ అధికారులు బెదిరించడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికీ రంజన్ల తయారీ వృత్తిపైనే ఆధారపడిన వారు జిల్లాలో దాదాపు 25వేల మంది ఉంటారు. ప్రస్తుతం తమకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ, సహకారాలూ అందడంలేదని వాపోతున్నారు. రాష్ట్రంలో కులవృత్తులు బాగా తగ్గిపోయిన టైమ్ లో … ఉన్నవారినైనా కాపాడుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు కుమ్మరులు. కుల వృత్తులను ప్రోత్సహించేదిశగా పథకాలను తీసుకురావాలని కోరుతున్నారు.