ముందే వచ్చేసిన ఎండా కాలం.. అప్పుడే 36 డిగ్రీలు

ముందే వచ్చేసిన ఎండా కాలం.. అప్పుడే 36 డిగ్రీలు

తెలంగాణకు ముందుగానే ఎండా కాలం వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఫిబ్రవరి 5వ తేదీ జయ శంకర్ జిల్లా, కొమరం భీం జిల్లాల్లో అత్యధికంగా 36.9 డిగ్రీలు టెంపరేచర్ నమోదైంది. జగిత్యాలలో 36.7 డిగ్రీలు తీవ్రత నమోదైంది. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే పగటి పూట ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరుకోగా.. సికింద్రాబాద్ ఏరియాలో మాత్రం 34.6 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్ సిటీతోపాటు జిల్లాల్లోనూ ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో జనం అప్పుడే ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగానే ఉంటాయి.. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఎండా కాలంలో ప్రారంభంలో ఉండే టెంపరేచర్స్ ఇప్పుడే నమోదు కావటం విశేషం.

హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి.. ఈసారి మాత్రం 20 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదు కావటం చూస్తుంటే.. వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వింటర్ సీజన్ ఇంకా పోలేదు.. అయినా ఎండలు మండిపోవటంపై వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. రాబోయే మూడు, నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఎండలు ఎక్కువగానే ఉంటాయని.. ఆ తర్వాత కొంచెం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. 

Also Read : స్పెషల్ ఆఫీసర్లు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : ఇలా త్రిపాఠి

తెలంగాణ రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత అనేది మార్చి నెలలో మొదలయ్యి.. మే నెలాఖరు వరకు తీవ్రంగా ఉంటుందని.. ఈసారి 20 రోజుల ముందుగానే డ్రై వెదర్ రావటం వల్ల ఇబ్బంది పడుతున్నారు జనం. పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడిన ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి వాతావరణం ఉందని.. దీనికితోడు బంగాళాఖాతం నుంచి తూర్పు గాలుల రాష్ట్రం వైపు వీస్తుండటం వల్ల ఎండ తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు అధికారులు.