41 సీఆర్పీసీ నోటీసులపై సునీల్కు వారం గడువు

41 సీఆర్పీసీ నోటీసులపై సునీల్కు వారం గడువు

సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను ట్రోల్ చేశారనే అభియోగాలతో తెలంగాణ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసుపై స్పందించేందుకు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు వారం గడువు కోరారు. ఇవే ఆరోపణలతో తమ కార్యాలయ ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులపైనా వారం గడువు కావాలని ఆయన కోరారు. దీంతో  సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కు వారం గడువు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ కనుగోలు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. 

సునీల్ కనుగోలు కేసులో ‘తెలంగాణ గళం’ ఫేస్బుక్ పేజీపై నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘తెలంగాణ గళం’ పేరుతో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను ట్రోల్ చేస్తూ వీడియోలు పెట్టారని తుకారంగేట్కు చెందిన సామ్రాట్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు  చేశారు. మాయాబజార్ సినిమాలోని ఓ వీడియోలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఫేస్లను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి  ఫిర్యాదులో పేర్కొన్నారు. సామ్రాట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈక్రమంలోనే సునీల్ కార్యాలయంలోని ముగ్గురికి 41(a) నోటీసులిచ్చి.. డిసెంబరు 17 న ఉదయం 10:30 కు తమ ఎదుట హాజరుకావాలని కోరారు. తాజాగా ఇవాళ సునీల్ కనుగోలు ఈ నోటీసులపై స్పందించేందుకు వారం రోజులు గడువు కావాలని కోరడం గమనార్హం.