- ఇప్పటికే 70 శాతం పూర్తైన పనులు
- రూ.2,215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్ట్
- నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీకి చేరుకున్నా నగరానికి నీటి సరఫరా
- పనులను స్పీడప్ చేసిన మెట్రోవాటర్‌బోర్డు
హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్నప్పటికీ జంటనగరాలకు నీటి తరలింపులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చేపట్టిన ‘సుంకిశాల ఇంటెక్ వెల్’ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ పనులను మరో నాలుగు నెలల్లోనే పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి గతేడాది మార్చి నాటికే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా అనేక కారణాల వల్లపనులు ఆలస్యం అవుతూ వచ్చాయి.
నగరంలో నీటి కొరత లేకుండా...
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 510 అడుగుల వరకు నీరు ఉన్నా సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నీటి మట్టం 510 అడుగుల కంటే తగ్గితేనే పుట్టంగండి పంప్ హౌజ్ స్టేషన్‌కు నీరు అందదు. దీంతో ప్రతీసారి పంపింగ్ ద్వారా నగరానికి నీటిని తరలిస్తున్నారు. ఇందుకోసం రూ. 6 నుంచి రూ. 7 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. నాగార్జునసాగర్ నీటి మట్టం 510 అడుగుల కంటే తగ్గినప్పటికీ సుంకిశాల వద్ద పుష్కలంగా నీరు ఉంటుంది.
ఇక్కడి పుట్టంగండి పంప్‌హౌజ్ నుంచి నీటిని కోదండాపూర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలించి నగరానికి నీటిని సరఫరా చేసేందుకు సుంకిశాల ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ సంవత్సరం నీటి డిమాండ్ అధికారంగా ఉండడంతో వాటర్ బోర్డుపై తీవ్ర ఒత్తిడి పడింది. మరోసారి ఇలాంటి పరిస్ధితి రాకుండా వచ్చే వేసవి నాటికి సుంకిశాల ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రూ. 2215 కోట్లతో ప్రాజెక్ట్ పనులు
సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్‌ను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. ముందుగా ఈ ప్రాజెక్ట్‌కు రూ. 1,450 కోట్లు ఖర్చు అవుతాయని భావించి పనులు ప్రారంభించారు. కానీ పనుల నిర్వహణలో అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇంటెక్ వెల్ తవ్వకాల టైంలో భూమి లోపలి పొరల్లో రాయి ఉండడం వల్ల డ్రిల్లింగ్, రాయి తరలింపు తదితర పనుల్లో ఆలస్యం జరిగినట్లు ఆఫీసర్లు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ వ్యయం రూ. 2,215 కోట్లకు చేరుకుంది. ఈ వెల్‌కు సంబంధించి నాలుగు బ్లాక్‌లలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. సుంకిశాల ఇంటెక్ వెల్‌లోకి సాగర్ నీటిని తరలించేందుకు మూడు ప్రాంతాల్లో మూడు లెవల్స్‌లో సొరంగాలు నిర్మిస్తున్నారు.
అలాగే సుంకిశాల హెడ్ వర్క్స్, అండర్ గ్రౌండ్ షాఫ్ట్స్, ఇంటెక్ టన్నెలింగ్, పంప్ హౌజ్‌లతో పాటు సుంకిశాల నుంచి కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తరలించేందుకు 35 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు 10 కిలోమీటర్లు పూర్తయినట్లు ఆఫీసర్లు తెలిపారు. ముఖ్యంగా 147 అడుగుల లోతులో నిర్మాణం జరుగుతున్న సొరంగం పనులు మాత్రం ఇంకా మిగిలి ఉన్నట్లు చెప్పారు.
ప్రాజెక్ట్ పూర్తైతే పంపింగ్ అవసరం లేదు
నాగార్జునసాగర్‌లోని సుంకిశాల వద్ద నిర్మిస్తున్న ఇంటెక్ వెల్ ప్రాజెక్ట్ పూర్తయితే సాగర్ నీటి మట్టం 147 అడుగులకు తగ్గినా జంటనగరాలకు నీటి తరలింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మెట్రో వాటర్‌బోర్డుపై పడుతున్న ఆర్థికభారం పూర్తిగా తగ్గిపోనుంది. సుంకిశాల ఇంటెక్ ప్రాజెక్ట్ పూర్తయితే సాగర్‌లోని నీటిని అక్కంపల్లి కెనాల్‌కు తరలించడం, అక్కడి నుంచి కోదండాపూర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు నీటిని తరలిస్తారు.
అక్కడ నీటి శుద్ధి జరిగిన తర్వాత డైరెక్ట్‌గా హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా జరుగుతుంది. దీంతో సాగర్‌లో నీటి మట్టం తగ్గినా ఇరిగేషన్ ఆఫీసర్లపై ఆధారపడే అవసరం ఉండదు. అలాగే పుట్టంగండి నుంచి అత్యవసర పంపింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఆఫీసర్లు అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
