అదరగొట్టిన హైదరాబాద్.. ఆర్సీబీ ఎలిమినేట్

అదరగొట్టిన హైదరాబాద్.. ఆర్సీబీ ఎలిమినేట్

పాపం రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు. 13వ ప్రయత్నంలో అయినా కప్పు కల నెరవేర్చుకోవాలనుకున్న కోహ్లీసేనకు మళ్లీ నిరాశే. ఆ జట్టు ఆశలపై సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ నీళ్లు కుమ్మరించింది. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్‌‌కు దూసుకొచ్చిన సన్‌‌రైజర్స్‌‌ రెండో టైటిల్‌‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అదిరే ఆటతో ఆర్‌‌సీబీని టోర్నీ నుంచి ఎలిమినేట్‌‌ చేసింది. ముందుగా జేసన్‌‌ హోల్డర్‌‌ (3/25), నటరాజన్‌‌ (2/33)పదునైన బౌలింగ్‌‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో హైదరాబాద్‌‌ సక్సెస్‌‌ అయింది. ఆపై, చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ కేన్‌‌ విలియమ్సన్‌‌ (44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్‌‌) క్లాసిక్‌‌ ఇన్నింగ్స్‌‌తో గమ్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగే సెకండ్‌‌  క్వాలిఫయర్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు సవాల్‌‌ విసిరేందుకు రెడీ అయింది. 

అబుదాబి ఐపీఎల్‌‌ 13వ సీజన్‌‌లో చివరి దశలో అదరగొడుతున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరోసారి అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేసింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో క్వాలిఫయర్‌‌2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌లో  రైజర్స్‌‌ ఆరు   వికెట్ల తేడాతో ఆర్‌‌సీబీని ఓడించింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 రన్స్‌‌ చేసింది. ఏబీ డివిలియర్స్‌‌ (43 బంతుల్లో 5 ఫోర్లతో 56), ఆరోన్‌‌ ఫించ్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్​తో 32) మాత్రమే రాణించారు. ఓపెనర్‌‌ దేవదత్‌‌ పడిక్కల్‌‌ (1), కెప్టెన్‌‌ కోహ్లీ (6), మొయిన్‌‌ అలీ (0) ఫెయిలయ్యారు. ఓవరాల్‌‌గా ముగ్గురు మాత్రమే డబుల్‌‌ డిజిట్‌‌ దాటగలిగారు. అనంతరం ఛేజింగ్​లో 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 134 రన్స్‌‌ చేసి రైజర్స్‌‌ గెలిచింది. విలియమ్సన్‌‌తో పాటు చివర్లో జేసన్‌‌ హోల్డర్‌‌ (20 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్‌‌) సత్తా చాటాడు. విలియమ్సన్​కు  ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది.

ఆదుకున్న ఏబీ, ఫించ్

ఆర్‌‌సీబీ ఇన్నింగ్స్‌‌ పడుతూ లేస్తూ చాలా చప్పగా సాగింది. ఏబీ డివిలియర్స్‌‌ ఫిఫ్టీ కొట్టినా.. ఆరోన్‌‌ ఫించ్‌‌ ఆకట్టుకున్నా మిగతా ప్లేయర్లు బ్యాట్లెత్తేశారు. రైజర్స్‌‌ అద్భుత బౌలింగ్‌‌ ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో అతి కష్టమ్మీద ఆ మాత్రం స్కోరు చేసిందా జట్టు. జోరుమీదున్న కరీబియన్‌‌ పేసర్‌‌ జేసన్‌‌ హోల్డర్‌‌ స్టార్టింగ్‌‌లోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లలో కెప్టెన్‌‌ కోహ్లీ, దేవదత్‌‌ పడిక్కల్‌‌ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. కీలక మ్యాచ్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన కోహ్లీ నిరాశ పరిచాడు. సెకండ్ ఓవర్లో హోల్డర్‌‌ లెగ్‌‌ సైడ్‌‌ వేసిన గుడ్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌ అతని గ్లోవ్స్‌‌ను తాకుతూ కీపర్‌‌ చేతిలో పడింది. ఇక, ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్‌‌ పడిక్కల్‌‌.. ఈ సారి ఫెయిలయ్యాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన అతను గార్గ్‌‌కు ఈజీ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో క్రీజులోకి వచ్చిన ఆరోన్‌‌ ఫించ్‌‌, ఏబీ డివిలియర్స్‌‌ జాగ్రత్త పడారు.  మరో పేసర్‌‌ సందీప్‌‌ శర్మ (0/21) కూడా పొదుపుగా బౌలింగ్‌‌ చేయడంతో పవర్‌‌ప్లేలో 32 పరుగులే రాగా.. అందులో కేవలం రెండే బౌండ్రీలున్నాయి.  ఫీల్డ్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ మారిన తర్వాత రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు రషీద్‌‌ ఖాన్‌‌, షాబాజ్‌‌ నదీమ్‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో తర్వాతి మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. ఫించ్‌‌ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ ఒక్కో పరుగు జతచేయగా.. మరో ఎండ్‌‌లో ఏబీ స్టయిల్‌‌కు భిన్నంగా పూర్తి డిఫెన్స్‌‌ ఆడాడు.

రషీద్‌‌ వేసిన పదో ఓవర్లో మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా భారీ సిక్సర్‌‌ కొట్టిన ఫించ్‌‌ గేరు మార్చే ప్రయత్నం చేశాడు. పది ఓవర్లకు స్కోరు 54/2.  ఇద్దరు సెట్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ ఉండడంతో తర్వాత అయినా ఆర్‌‌సీబీ జోరు పెంచుతుందేమో అనిపించింది. కానీ, నదీమ్‌‌ వేసిన 11వ ఓవర్లో టీమ్‌‌కు డబుల్‌‌ స్ట్రోక్‌‌ తగిలింది. నదీమ్‌‌  స్లోబాల్‌‌ను షాట్‌‌ ఆడిన  ఫించ్‌‌.. సమద్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 41 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌కు బ్రేక్‌‌ పడింది. ఆపై, ఫ్రీ హిట్‌‌ బాల్‌‌కు లేని పరుగు కోసం వచ్చిన మెయిన్‌‌ అలీ ని రషీద్‌‌ రనౌట్‌‌ చేయడంతో బెంగళూరు 62/4తో మరింత డీలా పడింది. ఈ దశలో ఏబీ ఇన్నింగ్స్‌‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. శివమ్ దూబే (8)తో కలిసి వికెట్ల మధ్య చురుగ్గా రన్‌‌ చేయడంతో పాటు వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టాడు. 16వ ఓవర్లో  మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన హోల్డర్‌‌.. దూబేను ఔట్‌‌ చేసినా లాస్ట్‌‌ బాల్‌‌కు బౌండ్రీకి పంపి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు కూడా వంద దాటింది. ఏబీ క్రీజులో ఉండడంతో కనీసం 140 రన్స్‌‌ అయినా వస్తాయనిపించింది. కానీ, 18వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (5)ను వెనక్కుపంపిన నటరాజన్‌‌ ఆపై  కళ్లు చెదిరే యార్కర్‌‌తో ఏబీని క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. ఆ ఓవర్లో రెండే పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో హోల్డర్‌‌ ఐదు రన్స్‌‌ ఇచ్చాడు. అయితే, చివరి ఓవర్లో  సైనీ (9 నాటౌట్‌‌), సిరాజ్‌‌ (10 నాటౌట్‌‌) చెరో ఫోర్‌‌తో 13 రన్స్‌‌ రాబట్టడంతో స్కోరు 130 దాటింది.

కేన్‌‌ నిలిచాడు

ఆర్‌‌సీబీ మాదిరిగా సన్‌‌ రైజర్స్‌‌ కూడా తడబడినప్పటికీ కేన్‌‌ విలియమ్సన్‌‌ చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో హైదరాబాద్‌‌కు కూడా మంచి ఆరంభం దక్కలేదు. సాహా ప్లేస్‌‌లో ఫస్ట్‌‌ టైమ్‌‌ బరిలోకి దిగిన కీపర్‌‌ శ్రీవత్స్‌‌ గోస్వామి (0)ని ఇన్నింగ్స్‌‌ ఫోర్త్‌‌ బాల్‌‌కే ఔట్‌‌ చేసిన సిరాజ్‌‌ ఆర్‌‌సీబీకి ఫస్ట్ బ్రేక్‌‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌‌ వార్నర్‌‌ (17)  ఆచితూచి ఆడినా వన్‌‌డౌన్‌‌లో వచ్చిన మనీశ్‌‌ పాండే  (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 24)మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌ చేశాడు. సిరాజ్‌‌ బౌలింగ్‌‌లోనే సిక్స్‌‌ కొట్టిన అతను సైనీ ఓవర్లో రెండు బౌండ్రీలతో జోరు చూపాడు. స్పిన్నర్‌‌ సుందర్‌‌కు ఫోర్‌‌తో వెల్‌‌కమ్‌‌ చెప్పిన వార్నర్‌‌.. సిరాజ్‌‌ వేసిన ఆరో ఓవర్లో ఫస్ట్‌‌ రెండు బాల్స్‌‌ను బౌండ్రీకి తరలించాడు. కానీ, నాలుగో బాల్‌‌కే అతన్ని ఔట్‌‌ చేసిన సిరాజ్‌‌ రివెంజ్‌‌ తీర్చుకున్నాడు. లెగ్‌‌ సైడ్‌‌ తక్కువ ఎత్తులో వచ్చిన బాల్‌‌ను డేవిడ్‌‌ డిఫెండ్‌‌ చేసే ప్రయత్నం చేయగా.. గ్లోవ్స్‌‌ను తగిలి కీపర్‌‌ చేతిలో పడింది. దీనికి అంపైర్‌‌ నాటౌట్‌‌ ఇచ్చినా రివ్యూలో వార్నర్‌‌ వెనుదిరగాల్సి వచ్చింది. పవర్‌‌ ప్లే తర్వాత స్పిన్నర్లు జంపా, చహల్‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు. వరుసగా ఆరు ఓవర్లు వేసిన ఈ ఇద్దరూ 20 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశారు.  ముఖ్యంగా తన తొలి మూడు ఓవర్ల స్పెల్‌‌లో 6 రన్సే ఇచ్చిన జంపా.. ధాటిగా ఆడుతున్న పాండేను కాట్‌‌ బిహైండ్‌‌ చేయగా, 12వ ఓవర్లో గార్గ్‌‌ను చహల్‌‌ బోల్తా కొట్టించడంతో హైదరాబాద్‌‌ 67/4తో డిఫెన్స్‌‌లో పడింది.  మరో ఎండ్‌‌లో సింగిల్స్‌‌కే పరిమితమైన కేన్‌‌కు హోల్డర్‌‌ తోడయ్యాడు. ఫస్ట్‌‌ 23 బాల్స్‌‌లో 13 రన్సే చేసిన విలియమ్సన్‌‌.. సుందర్‌‌ వేసిన 14వ ఓవర్లో డీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా భారీ సిక్స్‌‌తో గేరు మార్చే ప్రయత్నం చేశాడు. పవర్‌‌ ప్లే తర్వాత ఇదే ఫస్ట్‌‌ బౌండరీ కావడం విశేషం. చహల్‌‌ స్పెల్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు కూడా సిక్స్‌‌ కొట్టి జట్టును రేసులోకి తెచ్చాడు. చివరి 24 బాల్స్‌‌లో హైదరాబాద్‌‌కు 35 రన్స్‌‌ అవసరం అవగా రెండు  జట్లకూ అవకాశాలు కనిపించాయి. దూబే బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టిన కేన్‌‌ స్కోరు వంద దాటించాడు. సైనీ వేసిన 18వ ఓవర్లో  బౌండ్రీలైన్‌‌ వద్ద అందుకున్న క్యాచ్‌‌ను  పడిక్కల్‌‌ బ్యాలెన్స్‌‌ కోల్పోయి ముందుకు విసిరేయడంతో అతనికి లైఫ్‌‌ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకున్న  విలియమ్సన్‌‌ ఇంకో  ఫోర్‌‌ కొట్టగా ఓవరాల్‌‌గా పది రన్స్‌‌ వచ్చాయి. సిరాజ్‌‌ వేసిన 19వ ఓవర్లోనూ పది రన్స్‌‌ రావడంతో చివరి ఆరు బంతుల్లో రైజర్స్​కు 9 పరుగులు అవసరం అయ్యాయి. ఫస్ట్‌‌ బాల్‌‌కు సింగిల్‌‌ తీసిన కేన్‌‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత సైనీ డాట్‌‌ బాల్‌‌ వేయడంతో టెన్షన్‌‌ పెరిగింది. కానీ, తర్వాతి రెండు బాల్స్‌‌ను బౌండ్రీకి చేర్చిన హోల్డర్‌‌ మ్యాచ్​ను ముగించాడు.