డూ ఆర్ డై మ్యాచ్‎కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మాంచెస్టర్ టెస్ట్‎కు ఆకాష్ దీప్ ఔట్

డూ ఆర్ డై మ్యాచ్‎కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మాంచెస్టర్ టెస్ట్‎కు ఆకాష్ దీప్ ఔట్

బ్రిటన్: ఇంగ్లాండ్‎తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో భారత్‎కు అత్యంత కీలకమైన నాలుగో టెస్ట్‎కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఫోర్త్ టెస్ట్‎కు టీమిండియా స్టార్ బౌలర్ ఆకాష్​ దీప్ దూరమయ్యాడు. గాయం కారణంగా నాలుగో టెస్టుకు ఆకాష్ దీప్ దూరమైనట్లు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ ధ్రువీకరించాడు. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు మంగళవారం (జూలై 22) జరిగిన మీడియా సమావేశంలో గిల్ పాల్గొన్నాడు. నితీష్ రెడ్డి, పంత్, అర్షదీప్, ఆకాష్​ దీప్, అన్షుల్ కాంబోజ్ గురించి ఈ సందర్భంగా గిల్ క్లారిటీ ఇచ్చాడు. 

గాయం కారణంగా నితీష్ రెడ్డి, అర్షదీప్ ఇప్పటికే సిరీస్‎కు దూరమయ్యారని.. తాజాగా ఆకాష్ దీప్ కూడా ఫోర్త్ టెస్ట్‎కు దూరమయ్యాడని తెలిపారు. గాయం నయం కాకపోవడంతో మాంచెస్టర్‎లో జరగనున్న నాలుగో టెస్ట్ ఆకాష్ దీప్ ఆడడని కుండబద్దలు కొట్టాడు గిల్. బ్యాకప్ పేసర్‎గా జట్టులోకి వచ్చిన అన్షుల్ కాంబోజ్ నాలుగో టెస్టులో అరంగ్రేటం చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాడు. లార్డ్స్ టెస్టులో స్వల్ప గాయానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా సెట్ అయ్యాడని.. అతడు నాలుగో టెస్ట్‎లో బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు గిల్.

►ALSO READ | నేషనల్ స్పోర్ట్స్ బిల్ కిందికి BCCI.. స్వయం ప్రతిపత్తి కోల్పోనుందా.. ఎలాంటి మార్పులు జరుగుతాయి?

కాగా, బుమ్రా స్థానంలో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఆకాష్ దీప్ దుమ్మురేపాడు. రెండు ఇన్సింగ్స్‎ల్లో కలిపి ఏకంగా పది వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మాత్రం అంచనాల మేర రాణించలేదు. రెండు ఇన్సింగ్స్‎లో కలిపి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టి నిరాశపర్చాడు. గిల్ సేనకు డూ ఆర్ డై లాంటి నాలుగో టెస్టుకు ముందు ఆకాష్ దీప్ దూరమవడం జట్టు బౌలింగ్ కూర్పుకు ఇబ్బందిగా మారింది. 

కాగా, ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‎లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‎లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌‎లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.