SA20, 2024: మనోళ్లదే కప్: వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న సన్ రైజర్స్

SA20, 2024: మనోళ్లదే కప్: వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న సన్ రైజర్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్​లో సన్​రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ ఛాంపియన్​గా నిలిచింది. గతేడాది మొదలైన ఈ లీగ్​లో తొలిసారి ఛాంపియన్ గా నిలవగా.. నిన్న (ఫిబ్రవరి 10) డర్బన్ సూపర్ జెయింట్స్​తో జరిగిన ఫైనల్ సమరంలో 89 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వరుసగా రెండో సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీ ఇవ్వలేకపోయింది. టోర్నీ అంతటా నిలకడగా రాణించిన సన్ రైజర్స్ ఫైనల్లోనూ సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని చిత్తు చేసింది.
 
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ 30 బంతుల్లోనే 3 సిక్సులు, నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేశాడు. అబెల్ 34 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఓపెనర్ హర్మన్ (42) కెప్టెన్ మార్కరం (42) తమ వంతు పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జయింట్స్ 115 పరుగులకు ఆలౌటైంది. మార్కో జాన్సెన్ 5 వికెట్లతో డర్బన్ పతనాన్ని శాసించాడు. 38 పరుగులు చేసిన మల్డర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. టామ్ అబెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, హెన్రిచ్ క్లాసన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. 

సన్​రైజర్స్ టైటిల్ గెలవడంతో జట్టు యజమాని కావ్యా మారన్ ఆనందంతో గంతులేసింది. ఆమె సెలెబ్రేషన్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్​రైజర్స్ ప్లేయర్లకు విషెస్ చెప్పి.. టీమ్ అంతా ట్రోఫీ అందుకున్నాక స్టేజ్ మీదకి వెళ్లి వారితో ఒక ఫొటో దిగింది. ఈ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ..అందరికీ కృతజ్ఞతలు’ అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది. కావ్య మారన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు యజమాని అనే సంగతి తెలిసిందే. మార్కరం, క్లాసన్, మార్కో జాన్సెన్ లాంటి ఆటగాళ్లు ఫామ్ లో ఉండడటంతో ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.