IPL 2026: ఉప్పల్‎లో కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

IPL 2026: ఉప్పల్‎లో కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

హైదరాబాద్: ఐపీఎల్ 19లో తమ చివరి లీగ్ మ్యాచులో కాటేరమ్మ కొడుకులు బ్యాటింగ్‎లో విశ్వరూపం చూపించారు. సొంతగడ్డపై ఆర్సీబీతో జరిగిన మ్యాచులో పరుగుల సునామీ సృష్టించారు. ఓపెనర్ అభిషేక్ (56), క్లాసెన్ (51), ఇషాన్ కిషన్ (79) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (26), నితీష్ కుమార్ (30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాందార్ రెండు, సుయాష్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీశారు. 

కాటేరమ్మ కొడుకులు దంచుడే దంచుడు

ఈ మ్యాచ్‏లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‎కు శుభారంభం దక్కింది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆది నుంచే దంచుడు మొదలుపెట్టారు. ఇద్దరు పోటాపోటీగా బౌండ్రీలు బాదారు. ఈ క్రమంలో దూకుడు మీదున్న హెడ్ (26)ను రసిక్ బౌలింగ్‎లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‎కు 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 

ఈ దశలో ఇషాన్‎తో జతకట్టిన అభిషేక్ శర్మ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో సుయాష్ బౌలింగ్‎లో  అభిషేక్ (56) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన ఇషాన్, క్లాసెన్ ఇన్నింగ్స్‎ను మరో రేంజ్‏కు తీసుకెళ్లారు. 

తొలుత ఆచితూచి ఆడిన ఇద్దరూ ఆ తర్వాత గేర్ మార్చారు. పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లలను ఊచకోత కోశారు. మాంచి ఊపుమీదున్న  క్లాసెన్ (51) మరింత వేగంగా ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్‎లో వెనుదిరిగాడు. దీంతో మూడు వికెట్‎కు 113 పరుగుల పార్ట్‎నర్ షిప్ బ్రేక్ అయ్యింది. 

క్లాసెన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లు బాది 29 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్‎లో బ్యాటింగ్‎కు వచ్చిన ఇషాన్ కిషన్ ఇన్సింగ్స్ లాస్ట్ బౌల్‎కు ఔట్ అయ్యాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టి హైదరాబాద్‎కు భారీ స్కోర్ అందించాడు.