
రైజ్ అయ్యేదెవరు!
నేడు నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ
ముంబైతో పంజాబ్ అమీతుమీ
అబుదాబి: ఎనిమిది మ్యాచ్‌లు.. మూడు విజయాలు.. ఐదు ఓటములు. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్. ఇదీ ఐపీఎల్13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు. ప్లే ఆఫ్ రేస్ మొదలైన టైమ్‌లో ఆ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అయితే, గాయాల కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, ఇండియా స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ సేవలు కోల్పోయి డీలా పడ్డ రైజర్స్ మిడిలార్డర్ ఫెయిల్యూర్‌తో సతమతమవుతోంది. టాపార్డర్ రాణించినా.. బౌలింగ్‌లో మునుపటి పదును తగ్గడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఇంకో ఓటమి ఎదురైతే ప్లేఆఫ్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉండడంతో ఈ సమస్యల నుంచి సన్ రైజర్స్ వెంటనే బయటపడాల్సిందే. లీగ్‌లో తమలాగే ఇబ్బంది పడుతున్న కోల్‌కతాపై గెలిచి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే వార్నర్ సహా టాప్4 బ్యాట్స్‌మెన్ సత్తాచాటాల్సి ఉంటుంది. అలాగే, గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచిన టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి ఫామ్ అందుకుంటే హైదరాబాద్ విజయాల బాట పట్టగలదు. మరోవైపు కెప్టెన్ మారినా గత మ్యాచ్‌లో ముంబై చేతిలో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచిన ఆ జట్టును ఇయాన్ మోర్గాన్ గెలుపు బాట పట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ జట్టును కూడా బ్యాటింగ్ ఫెయిల్యూర్ దెబ్బతీస్తోంది. గత మ్యాచ్‌లో టాప్, మిడిలార్డర్ తీవ్రంగా నిరాశపరిచింది. మరి, సన్‌రైజర్స్‌పై కేకేఆర్ బ్యాట్స్‌మెన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక, మరో మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్‌తో బాటమ్ ప్లేస్‌లో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే పంజాబ్ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మరి, ముంబై ధాటికి ఆ జట్టు నిలుస్తుందో లేదో చూడాలి.
For More News..