హిట్​ అయినా అవకాశాలు రాలేదు

హిట్​ అయినా అవకాశాలు రాలేదు

‘ఒకే ఒక లోకం నువ్వే...లోకంలోన అందం నువ్వే’..‘ఈ పాట  వచ్చి చాలా నెలలైంది. కానీ, ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కాలర్​ట్యూన్​గా, రింగ్​టోన్​గా వినిపిస్తూనే ఉంది. ఆటోల్లో, బస్సుల్లో ఈ పాటే ఎక్కువగా వినపడుతోంది. మ్యూజిక్​ లవర్స్​ని అంతలా ఇంప్రెస్​ చేసిన ఈ పాట ‘శశి’ సినిమాలోది. ఈ పాటకి ట్యూన్స్​ కట్టింది మన వరంగల్​ అబ్బాయే. 
పేరు అరుణ్​ చిలువేరు. ఈ యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్ గిటారిస్ట్​ కూడా. దాదాపు ఐదువందలకి పైగా సినిమాలకి గిటార్​ వాయించాడు. ఎప్పుడూ తెర వెనక ఉండే ఈ మ్యుజీషియన్​ మొదట్లో​ ఎ. ఆర్​. రెహ్మాన్​ని చూసి కీబోర్డు నేర్చుకున్నాడట.  తన పదకొండేళ్లు మ్యూజిక్​ జర్నీ గురించి ...
లైఫ్​లో అనుకున్నవన్నీ వెంట వెంటనే  జరిగిపోవు. కొన్నిసార్లు నెలలు..కాదు కాదు సంవత్సరాలు టైం పడుతుంది. దశాబ్దాలు కూడా వచ్చి పోవచ్చు. కానీ, ఆ చివరి నిమిషం వరకు ప్రయత్నించేవాళ్లే సక్సెస్​ అవుతారు. ఆ కోవలోకే వస్తాడు అరుణ్ ​​. తను అనుకున్న దానికోసం ఏకంగా పదకొండేళ్లు శ్రమపడ్డాడు ఈ యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​. ఇండస్ట్రీలో సస్టైన్​ అవ్వడానికి వచ్చిన ప్రతి  అవకాశాన్ని  ఉపయోగించుకున్నాడు. అయినా సరే  తన ప్రతిభకి తగ్గ గుర్తింపు రాలేదు అంటున్నాడు. 
‘‘నేను పుట్టి, పెరిగిందంతా వరంగల్​లోనే. మాది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబమంటే సిచ్యుయేషన్స్​కి తగ్గట్టు పాటలు కంపల్సరీ. ఎప్పుడూ బ్యాక్​గ్రౌండ్​లో ఏదో ఒక పాట​ ప్లే అవుతూనే ఉండేది. అందరి నోట్లో ఏదో ఒక పాట ఉండేది. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ గంటల తరబడి పాటలు వినేదట. అలా... తెలియకుండానే పాట పరిచయం అయింది నాకు. నేను చదువుకున్న స్కూల్​లో ఎడ్యుకేషన్​తో పాటు క​ల్చరల్​ యాక్టివిటీస్​కి ఇంపార్టెన్స్​ ఇచ్చేవాళ్లు. అలా నా పాటలకి రెక్కలొచ్చినట్టు అయింది. ​బెంచ్​లు, బల్లలపై డిఫరెంట్​ ట్యూన్స్​ కట్టేవాడ్ని. అవన్నీ విని టీచర్స్, ఇంట్లో వాళ్లు
మ్యూజిక్​ డైరెక్టర్​ అవ్వమనేవాళ్లు. ఆ మాటల్ని పట్టుకుని ఏడో క్లాస్​లో   వరంగల్​లోని ‘పోతన మ్యూజిక్ కాలేజీ’కి వెళ్లా. కానీ, వాళ్లు నన్ను చేర్చుకోలేదు. 
అయిష్టంగానే గిటార్​
బెంచీ​లు, బల్లలపై డప్పులు వాయిస్తేనే ఇంతమంది పొగుడుతున్నారు. అదే సినిమాలకి ట్యూన్స్​ కడితే! ఆ ఆలోచనే భలే అనిపించింది. దాంతో గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టా. హిందూస్తానీ మ్యూజిక్​ నేర్చుకోవాలనుకున్నా. కానీ ‘పోతన’ మ్యూజిక్​ కాలేజీలో టెన్త్​ క్లాస్​ పూర్తయిన స్టూడెంట్స్​కి మాత్రమే ఎంట్రీ. దాంతో చేసేదేంలేక గిటారు నేర్చుకోవాలనుకున్నా. గిటారు ఎంచుకోవడం వెనుక  ఫ్లాష్​ బ్యాక్​ ఉంది. ఏ. ఆర్.​ రెహ్మాన్​కి వీరాభిమానిని నేను. ఆయన కీ బోర్డు వాయించడం చూసి నేనూ నేర్చుకోవాలనుకున్నా. అందుకోసం కష్టపడి ప్రీతమ్​ సర్​​ని కూడా వెతికి పట్టుకున్నా. కానీ, తీరా క్లాస్​కి వెళ్లాక ఆయన గిటారిస్ట్​ అని తెలిసింది. దాంతో చేసేదేంలేక కొంచెం అయిష్టంగానే గిటార్​ నేర్చుకున్నా. కానీ, అదే నా మ్యూజిక్​ కెరీర్​కి పునాది అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు.
ప్రైవేట్​గా చదువుతూనే...
టెన్త్​ వరకు గిటార్​ నేర్చుకుంటూనే స్కూల్​కి వెళ్లా. ఆ తర్వాత పోతన కాలేజీలో హిందూస్తానీ మ్యూజిక్​లో చేరా. ఒక పక్క గిటార్​, క్లాసికల్​ మ్యూజిక్​ మరో పక్క చదువు. ఏది ఇంపార్టెంట్?​ అని నన్ను నేను క్వశ్చన్​ చేసుకుంటే మ్యూజిక్​ వైపు వెళ్లాలనిపించింది. దాంతో ఇంటర్, డిగ్రీ ప్రైవేటుగా చదువుకుంటూ మ్యూజిక్​లోనే  రేయింబవళ్లు గడిపా. సొంతంగా  కీ బోర్డు కూడా నేర్చుకున్నా. నా ఇష్టానికి ఏరోజూ మా ఇంట్లోవాళ్లు అడ్డు చెప్పలేదు. నా విషయంలో నా కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్​గా ఉన్నారు. అలా అందరి ఎంకరేజ్​మెంట్​తో హిందూస్తానీ సంగీతంలో సర్టిఫికెట్​ కోర్సు పూర్తిచేశా. వరంగల్​ ఎన్​ఐటీలో గిటార్​,కీబోర్డు పాఠాలు కూడా చెప్పా. డిగ్రీ ఎగ్జామ్స్​ అయ్యాక సినిమా కలతో సిటీకొచ్చా.

గంటలో ఆయనముందున్నా

మా ఇద్దరు అన్నయ్యలు తప్పించి సిటీలో తెలిసినవాళ్లెవరూ లేరు. ఇండస్ట్రీలోనూ పరిచయాలు లేవు. దాంతో ఎక్కడ్నించి మొదలుపెట్టాలో అర్థం కాలేదు. ఆ కన్ఫ్యూజన్​లోనే మూడు నెలలు గడిచిపోయాయి. ఏదైనా ఇను​స్ట్రుమెంట్​ నేర్చుకుంటే మ్యూజిక్​ కెరీర్​ హెల్ప్​ అవుతుంది అనిపించింది. పియానో క్లాస్​లో చేరా. ఆ టైంలోనే ‘ఆర్కుట్’ సోషల్​ మీడియా ప్లాట్​ఫాం​లో సింగర్​ నిహాల్​ ప్రొఫైల్​ కనిపించింది. ‘నేను గిటార్​ ప్లేయర్’​ని​ అని మెసేజ్​ చేస్తే.. ‘మేము కొత్తగా బ్యాండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి కలవమ’ని రిప్లై ఇచ్చారు. ఆ మెసేజ్​ వచ్చిన గంటకే ఆయన ముందున్నా. వాళ్ల బ్యాండ్​లో గిటారిస్ట్​గా చేరా. నిహాల్​ సినిమా ప్రాజెక్ట్స్​కి అసిస్టెంట్​ ప్రోగ్రామర్​గా, గిటారిస్ట్​గా కూడా పనిచేయడం మొదలుపెట్టా. ఆ ప్రాసెస్​లోనే ఎమ్.​ ఎమ్. శ్రీలేఖ  నా వర్క్​ చూసి అసిస్టెంట్​ ప్రోగ్రామర్​గా అవకాశం ఇచ్చారు. ‘సూపర్​ సింగర్–5’కి  కూడా గిటారిస్ట్​గా చేశా. ఆ తర్వాత మ్యూజిక్​ ఇన్​ఛార్జ్​ల దృష్టిలో పడి వరుసగా సినిమాలకి గిటార్​ వాయిస్తున్నా. 
నా కల పక్కదారి పడుతోందని
ఇండస్ట్రీలో గిటార్ వాయించేవాళ్లు​ పెద్దగా లేరు. దాంతో తక్కువ టైంలోనే మంచి పేరొచ్చింది నాకు. నెలకి ఐదారు సినిమాలకి కూడా పనిచేశా. కీరవాణి, మణిశర్మ. అనురాగ్​ కశ్యప్​, తమన్​  ఇలా దాదాపుగా  మ్యూజిక్​ డైరెక్టర్స్​ అందరి  దగ్గర వర్క్​ చేశా. ‘బాహుబలి’, ‘మహానుభావుడు’, ‘నిన్నుకోరి’..  మొత్తం కలుపుకుని ఐదువందలకి పైగా సినిమాలకి గిటార్​ వాయించా.‘కలర్​ ఫొటో’,‘గుణ 369’,‘ఎస్​ ఆర్​ కళ్యాణ మండపం’ లాంటి చాలా సినిమాలకి మ్యూజిక్​ ప్రోగ్రామర్​గా చేశా. ఫైనాన్షియల్లీ సెటిల్​ అయ్యా. ఇండస్ట్రీలో కాంప్లిమెంట్స్​కి కొదవే లేదు. కానీ, సంతృప్తి లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చింది మ్యూజిక్​ డైరెక్టర్​ అవ్వాలని. నా కల పక్కదారి పడుతోందని అర్థమైంది. అందుకని మళ్లీ ఇటుగా అడుగులేశా. 
జనాల్లోకి వెళ్లలేకపోయా 
పాట హిట్ అయితే  మ్యూజిక్​ డైరెక్టర్, సింగర్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ,  ఆ పాటకి గిటార్​ ఎవరు వాయించారన్న ప్రస్తావనే రాదు. ఈ విషయంలో చాలా సార్లు బాధపడ్డా. ఇండస్ట్రీలో గుర్తింపు వస్తున్నా..జనాల్లోకి వెళ్లలేకపోతున్నానే అనిపించింది. అయితే ఇది నా ఒక్కడి సమస్యే కాదు..నాలాంటి చాలామంది టెక్నీషియన్ల పరిస్థితి ఇదే. అందుకే మ్యూజిక్​ డైరెక్టర్​గా​ లేదా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్​గా  పరిచయం అవ్వాలనుకున్నా. ఆ ప్రయత్నంలో కొంత సక్సెస్​ కూడా అయ్యా. ‘శశి’ సినిమా ఆల్బమ్​కి మంచి రీచ్​ వచ్చింది. కానీ, ఆ తర్వాత కూడా మ్యూజిక్​ డైరెక్టర్​గా పెద్దగా
అవకాశాలైతే రాలేదు. నన్ను నేను నిరూపించుకున్నప్పటికీ గుర్తింపు రాలేదు. దానికి లాక్​డౌన్ కూడా ఒక కారణం​ అనిపిస్తోంది. దానికి తోడు సినిమా పెద్దగా ఆడకపోవడం కూడా మైనస్​ అయింది. 
కెరీర్​ మొదలైంది ఇప్పుడే.. 
చాలామంది ‘ఒకే ఒక లోకం’ పాటని తెలుగు వాళ్లతో ఎందుకు పాడించలేదని అడుగుతున్నారు. కానీ, సింగర్స్​ సెలక్షన్​ మ్యూజిక్​ డైరెక్టర్​ ఒక్కడి చేతిలో ఉండదు. డైరెక్టర్​, ప్రొడ్యూసర్​ ఛాయిస్​ కూడా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏ సింగర్​ పాడితే సినిమాకి ప్లస్​ అవుతుందని ఆలోచిస్తారు. అయితే ఇదే సినిమాలో మిగతా పాటల్ని తెలుగువాళ్లే పాడారు. కొత్త సింగర్స్​తోనూ  పాడించా.  ప్రస్తుతం చేతిలో ‘మిస్టర్​ వర్క్​ ఫ్రమ్​ హోం’ అనే సినిమాతో పాటు మరో సినిమాకు పని చేస్తున్నా. మొదటి ఆల్బమ్​ హిట్​ అవడంతో ఈసారి నానుంచి ఆ స్థాయి​ మ్యూజిక్​నే ఎక్స్​పెక్ట్​ చేస్తారు. అందుకని కొంచెం స్పెషల్​ కేర్​తీసుకుంటున్నా. నా కెరీర్​ ఇప్పుడే మొదలైందని నా అభిప్రాయం. 
అందరూ ‘నో’ అన్నారు
నాలుగ్గోడల మధ్య ఉండటం అస్సలు నచ్చదు నాకు. అందుకే ఎంత టైట్​ షెడ్యూల్​ ఉన్నా రోజులో కాసేపయినా బయటికెళ్తా. కార్లు అంటే చాలా ఇష్టం. స్వీట్స్​ బాగా తింటా. మనసుకి నచ్చిన అమ్మాయిలందరికీ ప్రపోజ్​ చేశా. కానీ ఒక్కరు కూడా తిరిగి చూడలేదు (నవ్వుతూ). దాంతో అరేంజ్డ్​ మ్యారేజ్​ చేసుకుందామని ఫిక్స్​ అయ్యా. నేను ‘శశి’ కన్నా ముందు ‘ఐతే 2.0’ సినిమాకి మ్యూజిక్​ కంపోజ్​ చేశా. యాక్టింగ్​ ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్​లో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా. 
మ్యూజిక్​ మారుతోంది
ఆడియెన్స్​ని బట్టి మ్యూజిక్ ఎప్పుడూ​ మారదు. వచ్చే మ్యూజిక్​ని బట్టే ఆడియెన్స్​ అభిరుచి మారుతుంటుంది. అయితే ఇప్పుడు మ్యూజిక్​ ఫాస్ట్​ ఫుడ్​లా అయిపోయింది. ఇంతకుముందు ఒక హిట్​ సాంగ్​ రెండుమూడు సంవత్సరాలు వినపడేది. కానీ, ఇప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. మరీ సూపర్​ హిట్​ అయితే ఇంకొన్ని రోజులు నిలుస్తున్నాయి.  ::: ఆవుల యమున