Chocolates : చిట్టి పొట్టి స్వీట్స్.. పిల్లలైనా.. పెద్దలైనా సరదాగా హ్యాపీగా తినేవి ఇవే..

Chocolates : చిట్టి పొట్టి స్వీట్స్.. పిల్లలైనా.. పెద్దలైనా సరదాగా హ్యాపీగా తినేవి ఇవే..

సమ్మర్​ హాలిడేస్​ కొనసాగుతున్నాయి.  అమ్మా.. ఏదన్నా తింటానికి పెట్టు.. అంటూ పిల్లలు మారాం చేస్తుంటారు. కొందరైతే బయట పదార్దాలు తీసుకొచ్చి పెడతారు.  అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా .. పిల్లల గోల భరించలేక  బయట దొరికే చిరుతిండ్లు తప్పడం లేదు. అలా కాకుండా ఇంట్లోనే వెరైటీగా చాక్లెట్లు, లాలీపాప్, క్యాండీలను తయారు చేసుకోవచ్చు.  ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం .. . 

ఎంత వద్దన్నా... చాక్లెట్లు, లాలీపాప్, క్యాండీలను పిల్లలు తినకమానరు. మరి అలాంటప్పుడు, బయట మార్కెట్లో దొరికే వాటికన్నా, ఇంట్లో తయారు చేసినవి మేలు కదా. అలా ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలకే కాదు... తల్లులకు కూడా థ్రిల్​ గా  ఉంటుంది. చేయాలని ఉన్నా... ఎలా చేయాలో తెలియకే చాలామంది ఆగిపోతారు. అలాంటివాళ్ల కోసమే ఈ రెసిపీలు. మరింకెందుకు ఆలస్యం... వెంటనే ట్రై చేయండి. 

చాకొలెట్​ తయారీకి కావాల్సినవి 

  • కొకొవా పొడి : రెండు కప్పులు
  • మైదా పిండి :   పావుటీ స్పూన్ 
  • బట్టర్ (వెన్న) : ముప్పావు కప్పు 
  • నీళ్లు : ఒక కప్పు
  •  పాలు : ముప్పావు కప్పు 
  • చక్కెర పొడి:  పావు కప్పు


తయారీ విధానం: కొకొవా పాడిని బట్టర్ తో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి స్టవ్ వెలిగించి పెద్ద గిన్నెలో నీళ్లు వేడి చేయాలి. అందులో మరో చిన్నగిన్నె పెట్టి కొకోవా మిశ్రమాన్ని వేయాలి. రెండు, మూడు నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. అందులో  గోరువెచ్చని పాలు, చక్కెర పొడి, పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం మృదువుగా ఆయ్యాక చాకొలెట్ మౌల్ట్స్​ లేదా ఫ్రిజ్ ఐస్​ ట్రేలో వేయాలి. రెండు గంటల తర్వాత చాకొలెట్లను బయటికి తీసి, పిల్లలకు ఇవ్వండి సంతోషంగా తింటారు. 

గమ్మీ క్యాండీ తయారీకి కావాల్సినవి 

  • జిలటిన్​ షీట్స్​ (మార్కెట్లో దొరుకుతాయి):  ఆరు 
  • నీళ్లు : అర కప్పు
  • చక్కెర :  అర కప్పు
  • తా జా నిమ్మరసం :  ఒక టేబుల్ స్పూన్ 
  • పండ్ల రసం (ఇష్టాన్ని బట్టి పండును ఎంచుకోవచ్చు): అరకప్పు

తయారీ విధానం:  జెలటిన్ షీట్లను  ఐదు నిమిషాల పాటు చల్లటి నీళ్లలో నానబెట్టాలి మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. అందులో మీకు నచ్చిన పండ్ల రసం... నీళ్లు, నిమ్మరసం వేసి కలపాలి. చక్కెర కూడా వేసి మరిగించాలి. మంటను తగ్గించి, చల్లటి నీళ్లల్లోంచి.. జిలటిన్ షీట్లను తీసి అందులో వేయాలి.  రెండు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. మిశ్రమాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకుని ఐదారు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ పెద్దసైజు క్యాండీని నచ్చిన ఆకారం, సైజులో కట్​ చేసుకోవాలి. కావాలనుకుంటే వాటిపై పల్చగా నూనె రాసి చక్కెర పొడి దొర్లించవచ్చు. 

టూటీ ఫ్రూటీ తయారీకి కావాల్సినవి 

  • పచ్చి బొప్పాయి: అర కిలో
  •  నీళ్లు :ఏడు కప్పులు
  • చక్కెర: రెండు కప్పులు
  • వెనిల్లా ఎసెన్స్ : ఒక టీ స్పూన్
  •  ఫుడ్ కలర్ (ఎరుపు, ఆరు పచ్చ, పసుపు రంగు):  ఒక్కోటి నాలుగు చుక్కలు

తయారీ తయారీ విధానం: పచ్చి బొప్పాయి తొక్క తీసి ముక్కలుగా తరుగాలి. తరిగిన ముక్కల్ని నాలుగు కప్పుల నీళ్లలో అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. బొప్పాయి ముక్కలు మెత్తగా కాకుండా కొద్దిగా ఉడికితే చాలు ... స్టవ్ వెలిగించి పాన్​ పెట్టి మిగిలిన మూడు కప్పుల నీళ్లు పోయాలి. అందులో చక్కెర వేసి కలపాలి. లేత పాకం అయ్యేవరకు... అంటే దాదాపు పదిహేను నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత దాంట్లో వెనిల్లా ఎసెన్స్, సగం ఉడికిన బొప్పాయి ముక్కలు వేయాలి. కొద్ది సేప య్యాక ముక్కలను మూడు విడివిడి గిన్నెలో తీసుకొని, ఒక్కోదాంట్లో ఒక్కో ఫుడ్ కలర్ వేయాలి. వాటిని పన్నెండు గంటలు అరబెట్టాలి. పిల్లలు, పెద్దలు..  ఎంతగానో ఇష్టపడే టూటీ ఫ్రేట్​ రెడీ...

లాలీపాప్​ తయారీకి కావాల్సినవి 

  • చక్కెర :ఒక కప్పు 
  • కార్న్ సిరప్​ (మార్కెట్లో దొరుకుతుంది) -:అర కప్పు, 
  • నీళ్లు :పావు కప్పు
  • వెనిల్లా వెసిన్స్ : ఒకటీ స్పూన్
  • ఫుడ్ కలర్ (నచ్చినది) : తగినంత 
  •  పుల్లలు: సరిపడ


తయారీ విధానం: ఒక గిన్నెలో చక్కెర, కార్న్ సిరప్​ నీళ్లు పోసి కలపాలి. స్టవ్ వెలిగించి ఆ గిన్నెను సన్నని మంటపై పెట్టాలి. మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అది మరుగుతున్నప్పుడు వెనిల్లా ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి దింపేయాలి. ఆ మిశ్రమాన్ని లాలీపాప్ మౌల్ట్స్​, లేదా కాటన్ క్లాత్ మీద వేసి, పుల్లను మధ్యలో పెట్టి కొద్దిసేపు ఫ్రిజ్​ లో  పెట్టాలి. నోరూరించే రంగురంగుల లాలీపాప్ ను ఎవరైనా ఇష్టపడతారు.