టాలీవుడ్ మొనగాడు..నటశేఖరుడు ఇక లేరు

టాలీవుడ్ మొనగాడు..నటశేఖరుడు ఇక లేరు

తెలుగు సినీ చరిత్రలో ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. సాహస సినిమాలకు కేరాఫ్. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాడు కృష్ణ. నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు. స్టూడియో నిర్మించి.. ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. భారత సినిమా రంగంలో లెజెండ్ అనిపించుకున్నాడు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 

బుర్రిపాలెంలో జన్మించి..

1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. 1960లో ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ నుంచి బిఎస్సీ పట్టా అందుకున్నారు. దేవదాసు సినిమా 100 రోజుల పండుగకు ఏఎన్నార్, సావిత్రి తెనాలికి రాగా.. వారిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. అది చూసిన కృష్ణకు తాను అలాంటి గౌరవం పొందాలన్న కోరికతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. తొలుత నాటకాల్లో వేషాలు వేశారు. నాటకాల్లో రాణించడంతో మద్రాసు చేరుకుని సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీ కృష్ణ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. 

‘తేనె మనసులు’తో తొలి ఛాన్స్..

1964లో ‘తేనె మనసులు’ చిత్రంలో కృష్ణకు హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఆ తర్వాత మరో సినిమా చేసినా అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే మూడో చిత్రం ‘గూఢచారి 116’ ఘన విజయంతో ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 70, 80వ దశకాల్లో టాలీవుడ్లో ఆయనదే హవా. కృష్ణ ఏటా 10 సినిమాలు చేస్తుండేవారు. ఓ ఏడాదైతే 18 సినిమాల్లో నటించారంటే ఆయనకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

5 దశాబ్దాలు.. 340కిపైగా సినిమాలు

5 దశాబ్దాల సినీ కెరీర్‌‌లో కృష్ణ 340కిపైగా సినిమాలు చేశారు. 1968 నుంచి 74 వరకు ఏటా ఆయన నటించిన 10కిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కోసారి థియేటర్లన్నింటిలో కృష్ణ సినిమాలే ఆడేవి. డిమాండ్ ఉన్న హీరో కావడంతో ఆయన రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసేవారట. 52 ఏండ్ల సినీ కెరీర్‌లో సూపర్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు,పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, భలే దొంగలు,మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దు బిడ్డ, నంబర్‌ 1' తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. సాక్షి సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శించారు.

మేనమామ కూతురు ఇందిరా దేవితో పెళ్లి 

సూపర్ స్టార్ కృష్ణ 1962లో మేనమామ కూతురైన ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. గూఢాచారి చిత్రం బంఫ‌ర్ హిట్ అయిన తర్వాత... కృష్ణకు ఆఫర్లు వెల్లువెత్తాయి. కృష్ణ సినిమాల్లో ఎక్కువ‌గా విజ‌య నిర్మ‌ల హీరోయిన్‌గా చేశారు. ఈ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించడంతో ఎవ‌రికీ చెప్ప‌కుండా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు భార్య ఇందిరా దేవితో పాటు కుటంబ స‌భ్యులంద‌రికీ విషయం చెప్పారు. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నా ఇందిరాదేవి కృష్ణతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. 

సూపర్ స్టార్ బిరుదు కోసం ఓటింగ్..

కృష్ణను నటశేఖర, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని పిలుచుకునేవారు. అయితే సినీవార పత్రిక శివరంజని తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. అందులో కృష్ణ తిరుగులేని ఓటింగ్ సంపాదించారు. దీంతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ మూవీ (గూఢచారి 116) ఆయనే చేశారు. ఫస్ట్ కౌబాయ్ మూవీ (మోసగాళ్లకు మోసగాడు) చేసిందీ ఆయనే. తొలి ఫుల్‌ స్కోప్‌ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’తో సెన్సేషన్‌ క్రియేట్ చేయగా.. తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో వారెవా అనిపించుకున్నారు.

టాలీవుడ్ కు టెక్నాలజీ పరిచయం చేసి..

స్టీరియోఫోనిక్ సిక్స్ ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన మొదటి సినిమా కూడా ఇదే. ‘కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్‌‌ఓ సాంకేతికతను పరిచయం చేశారు. ‘గూడుపుఠాణి’తో ఓఆర్‌‌డబ్ల్యూ కలర్‌‌ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలే దొంగలు’ కూడా కృష్ణదే. ఇక బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మద్రాస్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ నటించిన ‘చీకటి వెలుగులు’ అని రికార్డులు చెబుతున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ అయితే హైదరాబాద్‌లో సంవత్సరం పాటు ఆడి రికార్డును నెలకొల్పింది.  పండంటి కాపురం, దేవుడు చేసిన మనుఫులు, ఊరికి మొనగాడు, ఈనాడు, అగ్నిపర్వతం.. ఇలా చాలా సినిమాలు తిరుగులేని విజయాల్ని అందించాయి. ముప్ఫై సంక్రాంతులకు ఆయన సినిమాలు విడుదలైతే.. 1976 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు కంటిన్యుయస్‌గా ప్రతి సంక్రాంతికీ ఆయన సినిమా విడుదలవడం మరో రికార్డ్.

డైరెక్టర్‌, నిర్మాతగానూ..

నటుడిగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్‌, నిర్మాతగానూ మారారు కృష్ణ. తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ నెలకొల్పారు. ఆ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి ‘అగ్నిపరీక్ష’ ఫెయిలైనా ఆ తర్వాత వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సూపర్‌‌ హిట్ అందుకుంది. ఇక దర్శకుడిగా శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు, సింహాసనం లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. తెలుగులో తొలి భారీ బడ్జెట్‌ సినిమా ‘సింహాసనం’ సూపర్ స్టార్ కృష్ణ నిర్మించారు. ఆ మూవీని ‘సింహాసన్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. మొత్తంగా 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ.. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు.

ఎన్నో రికార్డులు..

25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. 9 ఏండ్లలో 100 సినిమాల్లో నటించిన ఎవర్‌గ్రీన్‌ రికార్డు కృష్ణ సొంతం. సినీ కెరీర్లో 100కుపైగా దర్శకులతో పనిచేశారు. దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. విజయనిర్మలతో 48, జయప్రదతో 47, శ్రీదేవితో 31 చిత్రాలు,రాధతో 23 చిత్రాల్లో నటించారు. కృష్ణ మల్టీస్టారర్కు ఎప్పుడూ నో చెప్పేవారు కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌ బాబు, రజినీకాంత్, మోహన్‌బాబు తదితరులతో కలిసి నటించారు. 

జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతు

1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ బహిరంగ మద్దతు ప్రకటించారు. 1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం "ఈనాడు" సినిమా అప్పుడే రంగ ప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు 3 వారాలుండగా విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తన వంతు పాత్ర పోషించింది. 1983లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు.

రాజకీయాల్లో..

1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యాక ఈ విభేదాలు మరింత పెరిగాయి. రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కృష్ణ 1984లో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినా పార్టీ ఏలూరులోనే పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో  కృష్ణ ఓటమి పాలయ్యాడు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ కు కృష్ణ కుటుంబం నైతిక మద్దతు ప్రకటించింది.

పురస్కారాలు..

2008లో ఆంధ్రా యూనివర్సిటీ సూపర్ స్టార్ కృష్ణకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. భారతీయ సినిమాకు చేసిన సేవలకుగానూ.. కేంద్రం 2009లో పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. 2003లో ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ పురస్కారం అందుకున్నారు. 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్‌ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు. ఇలా ఐదు దశాబ్దాల కెరీర్లో సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి ఇంత పెద్ద సినీ పరిశ్రమలో తన ముద్ర వేసిన ప్రతిభ ఆయన సొంతం. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు.