అధికార లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
  • అధికార లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

  • వేలాదిగా వచ్చిన ఫ్యాన్స్​.. గవర్నర్​ తమిళిసై, ఏపీ సీఎం జగన్ నివాళి

హైదరాబాద్/మెహిదీపట్నం,  వెలుగు: ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రు నయనాల నడుమ సూపర్​ స్టార్​ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం 3.30 గంటలకు  జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు.  కృష్ణ​ కుమారుడు మహేశ్​బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణ పార్థివదేహాన్ని నానక్​రాంగూడలోని ఇంటి నుంచి అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పద్మాలయ స్టూడియోకు తీసుకువచ్చారు. 

అక్కడ మధ్యాహ్నం 12 గంటల దాకా అభిమానులు నివాళులర్పించారు.  తర్వాత రెండున్నరకు మహాప్రస్థానానికి అంతిమ యాత్ర సాగింది. 
పోటెత్తిన అభిమానులు కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియో వద్ద అందుబాటులో ఉంచుతారని తెలుసుకున్న అభిమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఉదయం ఏడు గంటలకే  తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు రావడంతో పద్మాలయ స్టూడియో పరిసరాలు కిక్కిరిసిపోయాయి.   

ట్రాఫిక్​ జామ్​.. స్వల్ప లాఠీచార్జ్​

సమయం గడుస్తున్న కొద్ది వేలాదిగా అభిమానులు తరలివస్తుండటంతో పద్మాలయ స్టూడియో వద్ద వారిని అదుపు చేయడం ఒక దశలో కష్టంగా మారింది. స్టూడియోలోకి చొచ్చుకుపోయేందుకు కొందరు ప్రయత్నించారు. గోడలు ఎక్కి లోపలికి వెళ్లేందుకు చూశారు. దీంతో  స్వల్ప లాఠీచార్జ్​ చేశారు. వీలైనంత తర్వగా అంతిమ యాత్రను మొదలుపెట్టడం మంచిదని కుటుంబ సభ్యులకు సూచించారు. కడచూపు చూడలేని వాళ్లు అంతిమ యాత్రలో పాల్గొనాలని అభిమానులను శాంతపరిచే ప్రయత్నం చేశారు.

కాగా, అభిమానుల తాకిడిని ముందస్తుగా అంచనా వేయని పోలీసులు.. పరిసరాల్లో ట్రాఫిక్​ను కంట్రోల్​ చేయలేక నానా తిప్పలు పడ్డారు. పద్మాలయ, మహాప్రస్థానికి వచ్చే అన్ని రహదారులు ట్రాఫిక్​జామ్​ అయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్​ పోలీసులు అప్పటికప్పుడు వేరే మార్గాల్లో వెళ్లాలని చెప్పడంతో వాహనదారులు సీరియస్​ అయ్యారు. ఇలాంటి సమయాల్లో నోటీసులు జారీ చేయాలని తెలియదా? అంటూ వాగ్వాదానికి దిగారు. కిలోమీటరు దూరంలోనే ఉన్న మహాప్రస్థానానికి అంతిమయాత్ర చేరుకునేందుకు అభిమానుల తాకిడి కారణంగా గంటకు పైగా పట్టింది. 

మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి..

భారీ జన సందోహంతో తరలివచ్చిన కృష్ణ పార్థివదేహాన్ని అధికార యంత్రాంగం మహా ప్రస్థానం వద్ద రిసీవ్​ చేసుకుంది.  కుటుంబ సభ్యులు, కొంత మంది ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. తర్వాత మహేష్​ బాబు మిగిలిన కార్యక్రమాలు నిర్వహించి కృష్ణకు తుది వీడ్కోలు పలికారు.

తరలి వచ్చిన ప్రముఖులు

సూపర్​స్టార్ కృష్ణకు నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు వచ్చారు. గవర్నర్​ తమిళిసై, ఏపీ సీఎం జగన్, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, ఏపీ మంత్రి రోజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీడీపీ నేత చంద్రమోహన్​ రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్​, సినీ ప్రముఖులు బాలకృష్ణ, జయప్రద, అల్లు అరవింద్​, కోట శ్రీనివాసరావు తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్.. కృష్ణ పార్థివదేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పలకరించారు. మహేష్​బాబును హత్తుకొని ఓదార్చారు.

అక్కడే ఉన్న సినీ నటుడు బాలకృష్ణకు నమస్కారం చేశారు. 20 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండి సినీ ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి కృష్ణ అని బండి సంజయ్​ పేర్కొన్నారు. కృష్ణ తెల్లకాగితం లాంటి మనిషని కోట శ్రీనివాసరావు అన్నారు. తనకు తన తండ్రి ఎన్టీయార్​, కృష్ణ ఇద్దరే గొప్ప నటులుగా తెలుసునని బాలకృష్ణ చెప్పారు. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలిగించని గొప్ప గుణం ఉన్న వ్యక్తి కృష్ణ అని అల్లు అరవింద్ అన్నారు.  రాజకీయాలకు అతీతంగా స్నేహంగా పలుకరించే వ్యక్తి కృష్ణ అని జయప్రద అన్నారు.