పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలి

పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలి
  • రైతుల ఆత్మహత్యలు నివారించాలి
  • జస్టిస్ బి.చంద్రకుమార్, ప్రొఫెసర్  కూరపాటి వెంకటనారాయణ 

కాశీబుగ్గ, వెలుగు: రైతులు సాగు చేసే ప్రతీ పంటకు మద్దతు ధర ప్రకటించి, చట్టబద్ధత కల్పించాలని జస్టిస్  బి చంద్రకుమార్, ప్రొఫెసర్  కూరపాటి వెంకటనారాయణ డిమాండ్​ చేశారు. మంగళవారం సిటీలోని అబ్బనికుంటలో రైతు సంఘం భవనంలో జరిగిన రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం లేకుండా ఉండాలంటే, వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించి కొత్త వంగడాలను తయారు చేసి మరింత అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలు చేశారు.

స్వామినాథం సిఫారసులను అమలు చేయాలని, పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పించాలని, విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50 శాతం సబ్సిడీపై అందించాలని తీర్మానంలో పేర్కొన్నారు.

ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని, పంటలకు అనుకూలంగా కేంద్రీకరణ చేపట్టి 75 శాతం  సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని, 60 ఏండ్లు దాటిన రైతులకు ప్రతి నెలా రూ.6 వేల పింఛన్​ అందించాలని తీర్మానించారు. సోమిడి శ్రీనివాస్, మహ్మద్​ షేక్​ హూస్సేన్, కిషన్​ రావు, తిరుపతిరెడ్డి, అంశాల రెడ్డి పాల్గొన్నారు.