రణరంగంగా మారిన బ్రెజిల్ రాజధాని..పార్లమెంట్, సుప్రీంకోర్టులో బీభత్సం

రణరంగంగా మారిన బ్రెజిల్ రాజధాని..పార్లమెంట్, సుప్రీంకోర్టులో  బీభత్సం

బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో  బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. గ్రీన్, ఎల్లో డ్రెస్సులతో రోడ్లపైకి దూసుకొచ్చిన వందలాది నిరసనకారులు.. నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని నినాదాలు చేశారు. అధ్యక్షుడు లూలా పదవి నుంచి దిగిపోయాలని డిమాండ్ చేశారు. 

నేషనల్ కాంగ్రెస్ భవనాన్ని  నిరసనకారులు ధ్వంసం చేశారు.  ఇంటర్​వెన్షన్ అంటూ సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగరేశారు. పార్లమెంట్ కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.  అధ్యక్ష భవనం మీదకు ఎక్కి నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు హెడ్ క్వార్టర్ లోనూ దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు...కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు జర్నలిస్టులు గాయపడ్డారు. మరికొందరు నిరసనకారులకు గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై  ఫాసిస్ట్ దాడిగా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లూలా దా సిల్వా అభివర్ణించారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఫాసిస్ట్ ఉన్మాదులు ప్రవర్తించారని మండిపడ్డారు. మరోవైపు దాడితో తమకేమి సంబంధం లేదని మాజీ అధ్యక్షుడు  బోల్సోనారో ప్రకటించారు. లూలా ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. 

బ్రెజిల్ రాజధానిలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడిఘటనపై ప్రపంచ దేశాల అధ్యక్ష, మాజీ అధ్యక్షులు తీవ్రంగా ఖండిచారు. ఈ దాడి ఘటనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రధాని మోడీ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఖండిచారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బ్రెజిల్ లో  గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వా చేతిలో బోల్సనారో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి బోల్సనారో మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. లూలా అధికారం చేపట్టకుండా మిలటరీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.