వికాస్‌‌‌‌ దుబే కేసులో.. ఎలాంటి కమిటీ కావాలె?

వికాస్‌‌‌‌ దుబే కేసులో.. ఎలాంటి కమిటీ కావాలె?

యూపీ సర్కారుకు సుప్రీం ప్రశ్న..

తెలంగాణ కేసు తరహాలో స్పందిస్తామన్న కోర్టు

న్యూఢిల్లీ, కాన్పూర్, లక్నో: ‘వికాస్ దుబే ఎన్కౌంటర్పై తెలంగాణ కేసు తరహాలోనే స్పందించబోతున్నాం.. చెప్పండి, మీ ప్రభుత్వం ఎలాంటి కమిటీ కోరుకుంటోంది? అంటూ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. దీనికి జవాబుగా ప్రభుత్వానికి కొంత టైమ్ ఇవ్వాలని మెహతా కోరడంతో, గురువారం వరకు టైమిస్తూ కేసు విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈమేరకు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్లను సీజేఐ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ మంగళవారం విచారించింది. బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసుల హత్య ఘటనతో పాటు దుబే ఎన్కౌంటర్పైనా సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ జరిపించాలంటూ పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణలో సీజేఐ మన రాష్ట్రంలో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. కాగా, వికాస్ దుబే, ఆయన అనుచరుల ఎన్కౌంటర్లపై స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ మంగళవారం తెలిపింది.

దిశ కేసులో ఏమైంది?
దిశపై దారుణానికి తెగబడ్డ నిందితులు ఆ తర్వాత పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. సీన్రీకన్స్ట్రక్చన్ కోసం తీసుకెళ్లగా నిందితులు నలుగురు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారని పోలీసులు చెప్పారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడడంతో పాటు తమ ఆయుధాలను లాక్కుని తమపై కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఆ కాల్పుల్లో నలుగురూ చనిపోయారని వివరించారు. ఈ ఘటనపై విచారణ కోసం రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్తో సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

కొంచెం టైమివ్వండి..
ఎన్కౌంటర్ ఘటనలో నిజానిజాలను కోర్టు ముందుంచేందుకు యూపీ సర్కారు ప్రయత్నిస్తోందని, కొంత సమయమివ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దుబేను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్కు తరలిస్తుండగా వెహికల్ అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసులతో పాటు దుబేకు గాయాలయ్యాయి. ఆ టైంలో దుబే పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల దగ్గరి నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపాడు. దీంతో దుబేపై కాల్పులు జరిపారు.

దుబే అనుచరుడి అరెస్ట్
వికాస్దుబే సహాయకుడు శశికాంత్ అలియాస్ సోను పాండేను పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్లో ఎనిమిది మంది పోలీసుల్ని చంపిన ఘటనలో శశికాంత్ నిందితుడు. ఆయన తలపై 50 వేల రివార్డు ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఛౌబేపూర్ లో శశికాంత్ను అరెస్టు చేసినట్టు యూపీ అడిషనల్ డీజీపీ ప్రశాంత్కుమార్ చెప్పారు. అతడిచ్చిన సమాచారం మేరకు ఏకే 47 రైఫిల్, 17 కార్ట్రిడ్జిలు, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

రెండు నెలల్లో రిపోర్టు ఇవ్వాలి..
పోలీసులు చెబుతున్న కథనంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దుబే అరెస్ట్ వార్తను పోలీసులు వెల్లడించిన తర్వాత కాసేపటికే ముంబై లాయర్ కోర్టును ఆశ్రయించారు. దుబే అనుచరులలో కొందరిని పోలీసులు ఇప్పటికే ఎన్కౌంటర్ చేశారని, దుబేను కూడా ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. దుబేకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ఎన్కౌంటర్ ఘటనపై అనుమానాలు వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ లేదా ఎన్ఐఏ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ ఏఎస్ బోపన్నల బెంచ్ విచారణకు స్వీకరించింది. మరోవైపు, ఈ కేసులో యూపీ సర్కారు ఇప్పటికే ఓ ఎంక్వైరీ కమిషన్ వేసింది. రెండు ఘటనలపై విచారించి, రెండు నెలల్లోగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

For More News..

ఆఫీసులకు రాకండి..  వాట్సాప్ చేయండి

మమత సర్కారును డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేయండి