- రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు దగ్గరి వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు చెప్తున్న బోయినపల్లి అభిషేక్ బెయిల్ పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ కు వాయిదా వేసింది. అలాగే అభిషేక్ బెయిల్ పిటిషన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో.. బోయినపల్లి అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి తో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్విచారణ జరిపింది. అభిషేక్ తల్లి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరఫు అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ వాదనలను ఈడీ తరఫు అడ్వకేట్ హుస్సేన్ తోసిపుచ్చారు. హాస్పిటల్ లో అభిషేక్ తల్లి లేరని, ఆయన అత్త ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఫ్యామిలీ మెంబర్లు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారన్న నెపంతో నిందితులు ఈ మధ్య బెయిల్ కోరడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ సమాధానంపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు అభిషేక్ బోయినపల్లికి మరో మూడు వారాల గడువు ఇస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ కు వాయిదా వేసింది.