రేప్ కారణంగా గర్భం దాల్చడం.. మహిళకు కోలుకోలేని గాయం

రేప్ కారణంగా గర్భం దాల్చడం.. మహిళకు కోలుకోలేని గాయం

న్యూఢిల్లీ: అత్యాచారం కారణంగా గర్భం దాల్చడం అనేది మహిళ జీవితానికి కోలుకోలేని గాయంలా నిలుస్తుందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అత్యాచారానికి గురై, గర్భం దాల్చిన మహిళ తన గర్భంలోని 27 వారాల పిండాన్ని తొలగించుకునేందుకు సోమవారం అనుమతించింది. బాధితురాలి మెడికల్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌‌‌‌‌‌తో కూడిన బెంచ్.. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. గర్భం రద్దు చేయాలన్న బాధితురాలి అభ్యర్థనను తిరస్కరించడం సరికాదని పేర్కొంది. గాయాన్ని మరింత పెంచుతది. 

‘‘ఓ మహిళ తల్లి కావడం అనేది ఆ దంపతులకు మాత్రమే కాదు. కుటుంబసభ్యులకు కూడా ఎంతో సంతోషకరమైన విషయం. కానీ వివాహ బంధం లేకుండా గర్భం దాల్చడం అనేది ఆ మహిళ జీవితానికి హానికరం. ముఖ్యంగా అత్యాచారం కారణంగా గర్భం రావడం బాధిత మహిళను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఇది ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది” అని బెంచ్ చెప్పింది. బాధిత మహిళ బాధను, మెడికల్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. మంగళవారమే ఆమె ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. ఒకవేళ గర్భ విచ్ఛిత్తి సమయంలో పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే.. ఇంక్యుబేషన్‌‌‌‌లో పెట్టి సంరక్షించాలని ఆదేశించింది. ఆ చిన్నారి బతికితే.. చట్టప్రకారం సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేసింది.

గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోంది?

గర్భ విచ్చిత్తి అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 7న గుజరాత్‌‌‌‌ హైకోర్టును అత్యాచార బాధితురాలు ఆశ్రయించింది. 8న కోర్టు విచారణకు స్వీకరించి.. మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. 10న నివేదిక రాగా.. ఈనెల 23వ తేదీకి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో గుజరాత్‌‌‌‌ హైకోర్టు తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి పిటిషన్‌‌‌‌ను పెండింగ్‌‌‌‌లో పెట్టడం వల్ల విలువైన సమయం వృథా అయిందని చెప్పింది. ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపడతామని తెలిపింది. అయితే ఈ లోగానే.. గత శనివారం గుజరాత్‌‌‌‌ హైకోర్టు విచారణ జరిపి మహిళ పిటిషన్‌‌‌‌ను కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘అసలు గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోంది? సుపీరియర్‌‌‌‌‌‌‌‌ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలో ఏ కోర్టూ ఉత్తర్వులు ఇవ్వకూడదు. ఇది రాజ్యాంగ ఫిలాసఫీకి విరుద్ధం’’ అంటూ ఘాటుగా స్పందించింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘క్లెరికల్ ఎర్రర్‌‌‌‌’‌‌‌‌ను సరి చేసేందుకే శనివారం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు.  

బీహార్ కుల గణనపై స్టే ఇవ్వలేం

బీహార్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై ప్రాథమికంగా కేసు నమోదు చేస్తే తప్ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని పిటిషనర్లకు స్పష్టం చేసింది. కుల గణనను నిలిపేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను పాట్నా హైకోర్టు కొట్టేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. సర్వే వల్ల పలు పరిణామాలు ఎదురవుతాయన్నారు. దీనిపై ప్రతిస్పందనను తెలియజేస్తామని చెప్పారు. దీంతో ఏడు రోజుల్లో ప్రతిస్పందనను దాఖలు చేసేందుకు ఆయనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌‌‌‌వీఎన్‌‌‌‌ భట్టితో కూడిన బెంచ్ అనుమతిచ్చింది. కానీ స్టేకు మాత్రం నిరాకరించింది.

మణిపూర్‌‌‌‌‌‌‌‌పై మూడు రిపోర్టులు అందజేసిన కమిటీ

మణిపూర్‌‌‌‌‌‌‌‌లో బాధితుల సహాయ, పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ.. సోమవారం మూడు రిపోర్టులను కోర్టుకు అందజేసింది. ఐడెంటిటీ డాక్యుమెంట్ల రీకన్‌‌‌‌స్ట్రక్షన్, కాంపెన్సేషన్ అప్‌‌‌‌గ్రెడేషన్, తమ కార్యకలాపాలకు సాయం చేసేందుకు నిపుణులను నియమించాలని పేర్కొంటూ రిపోర్టులను సబ్మిట్ చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. జస్టిస్ మిట్టల్ ప్యానెల్‌‌‌‌కు సహకారం అందించేందుకు, ఖర్చులకు సంబంధించిన నిధుల సమస్యలను పరిష్కరించేందుకు, ఇతర అంశాలపై ఆగస్టు 25న నిర్దిష్ట విధానపరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. 

ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలు 

ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్కార కేసులను పరిష్కరించేందుకు  నిబంధనలు ఉండాలని సుప్రీం సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌‌‌‌ మనోజ్‌‌‌‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ధిక్కార కేసుల్లో అధికారుల హాజరు తప్పనిసరని, ప్రభుత్వ అధికారులను పిలిపించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది.